సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి
‘2047 విజన్’ రూపకల్పన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గత రెండేళ్లలో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన సీఎం రేవంత్‌రెడ్డి కల. దీన్ని సాకారం చేసే దిశగా ప్రతీ ఒక్కరం అడుగులు వేస్తున్నాం, ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం నాకు అప్పగించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుంది.
అన్ని శాఖలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలి’అని భట్టి అధికారులకు సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ‘2047 రైజింగ్ విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’సమావేశంలో భట్టి ప్రసంగించారు. రెండేళ్లలో ఏం చేశామని చెప్పడమేకాక, భవిష్యత్ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నాం, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దబోయే విషయాలను ప్రపంచానికి విజన్ డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు తెలిపారు.
‘రింగ్’పూర్తయితే..
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 13 శాతం జీడీపీగా తెలంగాణను నిలపడం అసాధారణమేనని, దీన్ని సాధించేందుకే విజన్ డాక్యుమెంట్‌ను పకడ్బందీగా సిద్ధం చేయాలని భట్టి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మంచి వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయని, ఫార్మా, ఐటీ రంగాలకు దేశంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ అంశాలన్నింటికీ విజన్ డాక్యుమెంట్‌లో చోటు కల్పించాలని వివరించారు. రూ.36 వేల కోట్లతో చేపట్టే రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీపడలేదని స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 39 రేడియల్ రోడ్లు, వాటిని కలుపుతూ పెద్ద సంఖ్యలో ఇండ్రస్టియల్ క్లస్టర్లు రానున్నాయని వివరించారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయన్నారు. దేశంలోని ప్రముఖ నిపుణులను, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సీఈఓలను ఆహా్వనించి గ్లోబల్ సమ్మిట్‌ను పెద్ద పండుగలా నిర్వహించనున్నామని, వారి సలహాలను స్వీకరిస్తామని భట్టి చెప్పారు. గురువారం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలని కోరారు.
ఫైనల్‌గా సీఎం కసరత్తు
సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్‌కు ఆమోదం తెలియజేస్తారని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.85 వేల కోట్లతో చేపడుతున్న పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మహిళలకు అందజేసిందని చెప్పారు.
సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నతాధికారులు సంజయ్ కుమార్, వికాస్ రాజ్, శ్రీధర్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, హరీశ్, బుద్ధ ప్రకాష్, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ, నాగిరెడ్డి, చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం 9 కమిటీలు..
గ్లోబల్ సమ్మిట్ కోసం హాస్పిటాలిటీ అండ్ లాజిస్టిక్స్, ఫుడ్ అండ్ కల్చరల్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ మీడియా, కంటెంట్ క్రియేషన్ అండ్ ఐఈసీ, సెక్యూరిటీ అండ్ ప్రొటోకాల్, ఎంవోయూలు, ప్రకటనలు, ప్రోగ్రాం డిజైన్ సమన్వయం, ఇని్వటేషన్స్ అండ్ ఔట్‌రీచ్ కమిటీలను ఏర్పాటు చేశారు.


