‘అమెరికా నుంచి గాంధీ ఆస్పత్రి వరకు ఒకే చికిత్స’

Sabitha Indra Reddy: Same Treatment From America to Gandhi Hospital - Sakshi

సాక్షి, రంగారెడ్డి :  కరోనా వైరస్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనాతో ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రికి  కన్సర్న్ సంస్థ అందించిన నూతన అంబులెన్స్‌ను శాసన సభ్యులు కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఆస్పత్రిలో ఐసీయూ సెంటర్‌కు ఏడూ బెడ్లతో పాటు, 25 లక్షల విలువైన అంబులెన్స్ ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. అమెరికా నుంచి గాంధీ ఆస్పత్రి వరకు ఓకే చికిత్స అని, అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలు ఖర్చు చేయవద్దని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో ఒకే రకమైన వైద్యం అందిస్తున్నామని, పాజిటివ్‌ వస్తే భయానికి గురి కావొద్దని, ధైర్యంగా ఎదురుకోవాలని సూచించారు. (కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా)

వీటితోపాటు కొండాపూర్, షాద్‌ నగర్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇవ్వటంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు మూడు కోట్లతో వివిధ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లతో పాటు సౌకర్యాల కల్పనకు కన్సర్న్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతమందికి అయిన టెస్టులు చేయటానికి సిద్ధంగా ఉందన్నారు. టిమ్స్ ఆస్పత్రితో పాటు జిల్లాలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కోవిడ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవటానికి అను నిత్యం కృషి చేస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులు అయిన వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చేవెళ్ల ఆస్పత్రి సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ సేవలు గొప్పవని చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య తెలిపారు. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. (అంజలికి మంత్రి కేటీఆర్ చేయూత)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top