సాక్షి, హైదరాబాద్ : సిటీబస్సు స్తంభించింది. బుధవారం మొదటి రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగరంలోని వివిధ రూట్లలో అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపినప్పటికీ.. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. వస్త్ర దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలు, మాల్స్, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, హౌస్‌కీపింగ్ సిబ్బందిపై సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ పరిధిలోని 25 డిపోలకు చెందిన సుమారు 3 వేల బస్సుల్లో 90 శాతం డిపోలకే పరిమితమయ్యాయి.
రూ.6 కోట్ల నష్టం..
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆర్టీసీ అద్దె, ఎలక్ట్రిక్ బస్సులు నడిచాయి. సుమారు 450 ఎలక్ట్రిక్ బస్సుల్లో 400 వరకు నడిపినట్లు అధికారులు తెలిపారు. వివిధ డిపోల్లోని 260 అద్దె బస్సుల్లో 180 వరకు నడిచాయి. ఇవి కాక ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో మరో 120 బస్సులను అందుబాటులోకి తెచి్చనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిలో 35 వేల మందికిపైగా రాకపోకలు సాగించినట్లు అంచనా. సాధారణ రోజుల్లో సుమారు 23 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సమ్మెతో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
మహాత్మాగాంధీ, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, ఏఎస్‌రావునగర్ తదితర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచి్చంది. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, కార్లు తదితర వాహనాల్లో అడ్డగోలు చార్జీలు వసూలు చేశారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకున్నట్లు ప్రయాణికులు చెప్పారు. అన్ని వైపులా ఇదే తరహా దోపిడీ కొనసాగింది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు కూడా కొన్ని ఎలక్ట్రిక్, అద్దె బస్సులను నడిపినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు.
ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర క్యాబ్ సంస్థలు సైతం సమ్మెను సొమ్ము చేసుకున్నాయి. చార్జీలను రెట్టింపు చేశాయి. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ఓలా ఆటోలో సాధారణంగా రూ.150 వరకు చార్జీ అవుతుంది. బుధవారం రూ.350 వరకు వసూలు చేశారు. బైక్‌లు, క్యాబ్‌లలోనూ రెట్టింపు వసూళ్ల పర్వం కొనసాగింది.
కిక్కిరిసిన మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు..
ప్రయాణికులు మెట్రోరైళ్లు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించడంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 56 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణ రోజుల్లో మెట్రోల్లో 4.8 లక్షల మంది పయనించగా బుధవారం 5 లక్షల మందికి పైగా మెట్రో సేవలను వినియోగించుకున్నట్లు అంచనా.


