
సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో భట్టి, మీనాక్షి, పొంగులేటి, పొన్నం, మహేశ్‌గౌడ్, ఉత్తమ్, వాకిటి
బీసీ రిజర్వేషన్ల జీవోను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం
హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేలా కార్యాచరణ
సానుకూలంగా వస్తే ఎన్నికలకు..ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టుకు హైకోర్టు సానుకూల తీర్పుపై ఎవరైనా సుప్రీంకు వెళితే అక్కడ బలమైన వాదనలు విన్పించాలని నిర్ణయం
ఏజీ, అభిషేక్ మను సింఘ్వీతో మాట్లాడిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది.
కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
సీఎం కీలక భేటీ
బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్‌గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు.
సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్‌రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
కాంగ్రెస్ బీసీ నేతల భేటీ
సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.