
మొత్తంగా భర్తీ అయినవి 80,011 సీట్లు
సివిల్, మెకానికల్‌లో 68 శాతమే భర్తీ
91 శాతం నిండిన కంప్యూటర్ కోర్సుల సీట్లు
తుది విడత సీట్లు కేటాయించిన సాంకేతిక విద్యా విభాగం
సాక్షి, హైదరాబాద్: తుది దశ కౌన్సెలింగ్ పూర్తయినా ఇంజనీరింగ్‌లో ఇంకా 11,638 కన్వినర్ కోటా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పటిలాగే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లోనే సీట్లు ఎక్కువగా మిగిలాయి. అయితే, గ్రామీణ ప్రాంతాలు, నాణ్యత లేని కాలేజీల్లో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లకు ఆప్షన్లు తగ్గాయి. దీంతో ఈ కాలేజీల్లో 5,261 సీట్లు మిగిలిపోయాయి. తుది దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సాంకేతిక విద్యా విభాగం ఆదివారం సీట్లు కేటాయించింది.
ఈ దశలో 40,837 మంది 16,86,699 ఆప్షన్లు ఇచ్చారు. కన్వినర్ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 180 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది దశ ముగిసే నాటికి 80,011 (87.3 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 11,638 సీట్లు మిగిలిపోయాయి. 46 ప్రైవేటు, 5 యూనివర్సిటీల పరిధిలోని 51 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,085 సీట్లు వచ్చాయి. ఈ విడతలో కొత్తగా విద్యార్థులు 4,720 మంది సీట్లు పొందారు. 20,028 మంది బ్రాంచీలు మార్చుకున్నారు.
సీట్లు పొందినవారు ఈ నెల 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ స్లైడింగ్ నిర్వహిస్తారు. దీని ద్వారా కాలేజీల్లో అంతర్గతంగా బ్రాంచీలు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కంప్యూటర్, దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో 65,080 సీట్లు ఉంటే, 59,819 (91.92 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఎల్రక్టానిక్స్, దాని అనుబంధ బ్రాంచీల్లో 17,754 సీట్లు ఉంటే, 14,118 (79.52 శాతం) భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 7,675 సీట్లు ఉంటే, 5,236 (68.22 శాతం) నిండాయి.