యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆపేందుకు కుట్ర  | Power Minister Jagadish Reddy About Yadadri Thermal Power Plant | Sakshi
Sakshi News home page

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆపేందుకు కుట్ర 

Oct 7 2022 2:19 AM | Updated on Oct 7 2022 2:19 AM

Power Minister Jagadish Reddy About Yadadri Thermal Power Plant - Sakshi

సూర్యాపేట: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను ఆపేందుకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పవర్‌ప్లాంట్‌ నిర్మాణం ఆపాలంటూ ఎన్‌జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) ఇచ్చిన తీర్పుపై మంత్రి గురువారం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టామని స్పష్టం చేశారు.

ఎన్‌జీటీ తీర్పు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. ఈ తీర్పు యావత్‌ దేశానికి నష్టం కలిగించేలా ఉందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయన్నారు. ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌కి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కొట్టివేసిందని గుర్తు చేశారు. 

కేసు వేసిన ముంబై సంస్థ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఎన్‌జీటీ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని, న్యాయపోరాటం కూడా చేస్తామని తెలిపారు. అనుకున్న సమయానికల్లా యాదాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement