25వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహణ
సీఎం రేవంత్‌కు పౌల్ట్రీ సంఘాల ఆహ్వనం
సాక్షి, హైదరాబాద్: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్–2025 పేరుతో దక్షిణాసియాలోనే అతి పెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు హాజరు కానున్న ఈ ఎగ్జిబిషన్‌ను నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు..ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎగ్జిబిషన్‌లో చర్చ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
కాగా ఈ ఈవెంట్‌కు హాజరు కావాల్సిందిగా..శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసిన పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, కోశాధికారి శ్రీకాంత్‌తో పాటు చక్రధర్‌రావు, వెంకటేశ్వరరావు, కేజీ ఆనంద్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.నరసింహారెడ్డి, జీకే మురళి తదితరులు సీఎంను కలిశారు.
వన్ నేషన్–వన్ ఎక్స్‌పో: పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు బాటలు వేసేలా వన్ నేషన్–వన్ ఎక్స్‌పో అనే థీమ్‌తో 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌లో 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్స్, 40 వేలకు పైగా సందర్శకులు పాల్గొంటారన్నారు.


