ట్యాపింగ్‌ కేసులో రిమాండ్‌ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే! | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌ కేసులో రిమాండ్‌ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే!

Published Tue, Apr 2 2024 1:09 AM

Phone Tapping by instructions of BRS leadership says Remand Report - Sakshi

ట్యాపింగ్‌ కేసులో రిమాండ్‌ రిపోర్టు

బీఆర్‌ఎస్‌ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్‌ 

రాధాకిషన్‌రావు విచారణలో చెప్పారని రిమాండ్‌ రిపోర్టులో కోర్టుకు తెలిపిన సిట్‌ 

అప్పటి ప్రతిపక్షాలే టార్గెట్‌గా ఎస్‌ఐబీలో ప్రత్యేక టీమ్‌... కీలకంగా వ్యవహరించిన టి.ప్రభాకర్‌రావు 

ప్రతిపక్షాల నగదు రవాణాపై ప్రత్యేకంగా ఫోకస్‌... నేతలతోపాటు అనుచరులు టార్గెట్‌గా అక్రమ నిఘా 

ట్యాపింగ్‌లో గుర్తించిన సమాచారంతో టాస్‌్కఫోర్స్‌తో దాడులు చేయించి సొమ్ము  స్వాదీనం 

కొందరు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపైనా నిఘా కొనసాగిందని వెల్లడి 

మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్టైన హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ అధికారులు దీనితోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు.. 

‘‘రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్‌ఎస్‌ నాయకత్వం కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించింది. తమ కులంతోపాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసున్నారు. వివిధ విభాగాలు, జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్‌ విభాగంలోకి డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నారు.

అందులో నల్లగొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్‌రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్‌ నాయకత్వం హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు తరచుగా కలు స్తూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. 

గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ.. 
హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్లో వెస్ట్‌జోన్‌కు 2021 వరకు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును రాధాకిషన్‌రావు సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టుమల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్‌ల్లోని మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వీరి అక్రమాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా ప్రభాకర్‌రావు బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది.

వారంతా కేవలం వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ ద్వారానే సంప్రదింపులు జరిపేవారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు తన నమ్మినబంటు ప్రణీత్‌రావును స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) నిర్వహణ కోసమే తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి నేతలతోపాటు వారి అనుచరులనూ టార్గెట్‌ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌లో చేరేలా చేయడం వంటివే వారి టార్గెట్‌. 

నగదు రవాణాను గుర్తించి.. 
ప్రభాకర్‌రావు, ఆయన బృందం ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణాపై దృష్టి పెట్టింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భవ్య సిమెంట్‌ కంపెనీకి చెందిన ఆనంద్‌ ప్రసాద్‌ పోటీచేశారు. ఆ సమయంలో ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు రంగంలోకి దిగి.. ఆనంద్‌ ప్రసాద్‌ సంబందీకుల నగదు రవాణాపై నిఘాపెట్టారు. ఆ వివరాలను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు అందించారు.

ఈయన ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ప్యారడైజ్‌ వద్ద రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్‌రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంబందీకులపై నిఘా పెట్టి వివరాలను రాధాకిషన్‌రావుకు చేరవేశారు. ఫలితంగానే సిద్దిపేటలో చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వహించే రఘునందన్‌రావు బంధువు నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. 2022 అక్టోబర్‌ రెండోవారంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది.

అప్పట్లో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధీకులపై ప్రణీత్‌రావు సాంకేతిక నిఘా ఉంచారు. నగదు రవాణా అంశాన్ని గుర్తించి రాధాకిషన్‌రావుకు తెలిపారు. ఈయన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసి.. కోమటిరెడ్డి అనుచరులైన జి.సాయికుమార్‌రెడ్డి, ఎం.మహేందర్, ఎ.అనూ‹Ùరెడ్డి, వి.భరత్‌ల నుంచి రూ.3.5 కోట్లు స్వా«దీనం చేసుకుంది’’ అని సిట్‌ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. రాధాకిషన్‌రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.  

ప్రతిపక్షాలతోపాటు విమర్శించే వారిపైనా.. 
ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్‌రావు తన బృందమైన రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌రావు, తిరుపతన్నలకు స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబం«దీకులు, మద్దతిచ్చే వ్యాపారులతోపాటు బీఆర్‌ఎస్‌ను విమర్శించే వారిపైనా ప్రభాకర్‌రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆదేశాల మేరకు.. ఆ పార్టీ నాయకులు కొందరిపైనా నిఘా వేశారు. రాధాకిషన్‌రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసినా.. కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా రెండుసార్లు అవకాశమిచ్చారు. హైదరాబాద్‌ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement