హైదరాబాద్ : అమెరికాలోని ఫిలదెల్పియా నగరంలో పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేందుకు ఫిలదెల్పియా కన్వెన్షన్ అండ్ విజటర్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా చేపట్టిన రోడ్ షోలో భాగంగా బుధవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధి అజితేష్ సింగారియా మాట్లాడుతూ అమెరికాకు వచ్చే పర్యాటకుల్లో అత్యధిక శాతం న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి ప్రాంతాలను సందర్శిస్తుంటారని వీటికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతమైన ఫిలదెల్పియాలోఓ అనేక ఆకర్షణలు ఉన్నాయని వివరించారు. అమెరికాలోనే అత్యంత సుందరమైన గార్డెన్స్‌తో పాటు అనేక చారిత్రక ప్రాంతాలను 2026లో సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
అమెరికా 250 వార్షికోత్సవాల్లో భాగంగా 52 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఫిలదెల్పియాలో నిర్వహిస్తున్నారన్నారు. అద్భుతమైన మ్యూజియమ్స్, ఆర్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయన్నారు. జూలైలో ఫిఫా వరల్డ్ కప్‌కు ఫిలదెల్పియా వేదిక కానుందని అన్నారు. ఫిలదెల్పియాకు వచ్చే పర్యాటకుల్లో టాప్–3 పర్యాటకులు ఇండియా నుంచే వస్తుంటారని ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.


