
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిలి్చన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది.
సంగారెడ్డి: కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.
క్యాంపులో బిక్కుమంటూ..
బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్‌డెస్‌్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
దేవుడా కనికరించు
దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్‌తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న.
– కశ్మీరా కుమారీ, బీహర్
నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్‌గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది.
– సనాపతి, బీహర్
కళ్ల ముందే కకావికలం
సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను.
–యశ్వంత్, విజయవాడ