ఆక్సిజన్‌ కొనేస్తున్నారు!

Oxygen Stock Shortage Fake News Viral in Social Media Hyderabad - Sakshi

సిలిండర్‌ దొరక్క మహిళ చనిపోయినట్టు  సోషల్‌ మీడియాలో వార్త హల్‌చల్‌ 

రానున్న రోజుల్లో ఆక్సిజన్‌  లభ్యంకాదని పుకార్లు 

కరోనా భయంతో ముందే  ఆక్సిజన్‌ సిలిండర్లు కొంటున్న జనం 

వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు 

సాక్షి సిటీబ్యూరో: పాతబస్తీకి చెందిన ఓ యువకుడు తన తల్లికి ఆక్సిజన్‌ కోసం కారులో ఎక్కించుకొని ఎన్నో చోట్లకు వెళ్లాడు. ఎక్కడా ఆక్సిజన్‌ దొరకలేదు. దీంతో నేరుగా జల్‌పల్లిలోని ఆక్సిజన్‌ సిలిండర్‌ రీఫిల్లింగ్‌ యూనిట్‌కి రాత్రి 11 గంటలకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ కూడా ఆక్సిజన్‌ స్టాక్‌ లేదని, కొద్దిసేవు వేచి ఉండాలని నిర్వాహకులు చెప్పారు. ఇంతలోనే తల్లి అక్కడే మృతి చెందింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో నగరంలో ఆక్సిజన్‌ గ్యాస్‌ షార్టేజ్‌ అయిందని పుకార్లు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో కరోనా వ్యాధి తీవ్రత మరింత పెరిగి ఆక్సిజన్‌ అందుబాటులో ఉండదనే ఉద్దేశంతో నగర ప్రజలు ముందస్తుగా మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు కొంటున్నారు. 

రానురాను సిలిండర్లు దొరకవని ప్రచారం   
‘‘రానురాను కరోనా రోగుల సంఖ్య పెరిగి ఆక్సిజన్‌ సిలిండర్లు దొరుకుడు కష్టమట కదా? అందుకే ఒకట్రెండు సిలిండర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నా’’... పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి మాటలివి. కరోనా భయంతో ప్రైవేట్‌ దవాఖానాల్లో ముందే బెడ్లు రిజర్వు చేసుకుంటున్న వారు కొందరైతే, ఏకంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కొని ఇంట్లో దాచిపెట్టు కుందామనుకుంటున్నవారు మరికొందరు. శ్వాస సంబంధ వ్యాధు లు, వృద్ధాప్యం, వైరల్‌ లోడ్‌ అధికంగా ఉండటం. ఇలాంటి సమస్య లున్న వారికే ఆక్సిజన్‌ అవసరమని నివేదికలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయినా కొందరు అతిగా ఊహించుకొని హంగామా సృష్టిస్తున్నారు. అనవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెంచుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిందంటే చాలా కుటుంబ సభ్యులు, సంబంధీకులు రకరకాల సలహాలు ఇస్తున్నారు. రోగ లక్షణాలు ఉన్నా లేకున్నా.. వ్యాధి ముదిరినా లేకున్నా ఆక్సిజన్‌ సిలిండర్లు కొనాల్సిందేనని ఉచిత సలహాలు ఇస్తున్నారు. డాక్టర్‌ ఆక్సిజన్‌ అవసరం లేదని చేప్పినా ఆ మాటాలను పక్కన పెట్టి సిలిండర్లు కొంటున్నారు.  

డాక్టర్ల పర్యవేక్షణలోనే అందించాలి.... 
కరోనా పాజిటివ్‌ వస్తే రోగ లక్షణాలు అంతగా లేకపోతే డాక్టర్లు ఇంటివద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యసిబ్బంది నేరు గా ఇంటికి వెళ్లడం లేదా టెలీమెడిసిన్‌ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే డాక్టర్లు రోగం ముదిరే  వరకు ఇలాగే చేస్తున్నారని, రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్‌ వాడమంటున్నారని ఇళ్లలో సిలిండర్లు ముందస్తుగా పెడుతున్నారు. కొంతమంది డాక్టర్లకు తెలియకుండానే ఇళ్లలో రోగులకు ఆక్సిజన్‌ ఇస్తున్నారు.  శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి వైద్యుల పర్యవేక్షణలోనే కృత్రిమ శ్వాస అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ అవసరం ఉన్నా..లేకున్నా నగరంలో కోవిడ్‌ వ్యాధి బారిన పడ్డ రోగులు ఆక్సిజన్‌ వాడుతున్నారు. మరోవైపు పలువురు డాక్టర్లు రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లాని, లేని పక్షంలో చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top