మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు

Over 7000 CPI Workers Arrested Amid PM Narendra Modi Tour - Sakshi

ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు

‘ఖని’లో కూనంనేని అరెస్టు

మఖ్దూంభవన్‌ వద్ద నారాయణను అదుపులోకి..

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌ (చెన్నూర్‌): రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన నిర సన కార్యక్రమాల్లో 7 వేల మంది సీపీఐ కార్య కర్తలు, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. శని వారం తెల్లవారుజాము నుంచే అనేకమందిని గృహనిర్బంధం చేశారు. అలాగే పలువురిని నిరసనల సందర్భంగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును రామగుండం వెళ్తుండగా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తదితరులను మంచిర్యాల జిల్లా జైపూర్‌ స్టేషన్‌కు తరలించారు.

అలాగే సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన నిరసనలో పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సహా పలువురిని అరెస్టు చేసి అబిడ్స్‌ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను ఇంటి వద్ద అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లో నిరసన చేపట్టిన సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాలమల్లేశ్, ఈసీ ఐఎల్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వి.ఎస్‌.బోస్‌ అరెస్టయ్యారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు 
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సీపీఐ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మఖ్దూంభవన్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీ సులు రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం, అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని కె.నారాయణ మండిపడ్డారు. 

హక్కులను కాలరాశారు: కూనంనేని 
రాష్ట్రంలో మోదీ పర్యటన రాచరిక పాలనలో రాజు పర్యటనలా సాగిందని, ఆయనను వ్యతిరేకించే వారిని పోలీసులు ముందే నిర్బంధంలోకి తీసుకున్నారని కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటి వరకు ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కాగా, తమ నాయకుల అరెస్టుకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైపూర్‌ బస్టాండ్‌ నుంచి పోలీసుస్టేషన్‌కు వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండాపోయిందని, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు.
చదవండి: నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి: తమ్మినేని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top