నకిలీ కాల్‌ సెంటర్‌ కేసులో గూగుల్‌కు నోటీసులు

Notices To Google In Fake Call Center Case At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ కంపెనీల సర్వీస్‌ సెంటర్‌ పేరుతో రెండేళ్ల పాటు నకిలీ కాల్‌ సెంటర్‌ నడిపిన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గూగుల్‌ సంస్థకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. 30 మంది టెలీకాలర్లతో రామంతాపూర్‌ కేంద్రంగా ఈ సెంటర్‌ నడిపిన మహ్మద్‌ సలీమ్, మహ్మద్‌ అరీఫ్‌లను గత వారం పట్టుకున్న విషయం విదితమే. వీరు గూగుల్‌నే కేంద్రంగా చేసుకుని ఈ దందా కొనసాగించారు.

గూగుల్‌లో యాడ్‌ స్పేస్‌ కొనడంతో మొదలుపెట్టి కృత్రిమ హిట్స్, క్లిక్‌ ద్వారా అవి సెర్చ్‌లో మొదట కనిపించేలా చూశారు. దీనికి తోడు ఆయా సంస్థలకు చెందిన సర్వీసింగ్‌ సెంటర్ల చిరునామాలు ఒక చోట ఉండగా... గూగుల్‌ మ్యాప్‌లో వాటి స్థానాలను మార్చేసి కస్టమర్లలో గందరగోళం సృష్టించారు. ఇలా తమ నకిలీ కాల్‌ సెంటర్‌ వైపే వాళ్లు మొగ్గేలా చేసి వ్యాపారం పెంచుకున్నారు. కస్టమర్ల నుంచి అసలు రేట్లకు 30 నుంచి 40 శాతం అదనంగా వసూలు చేశారు. 

ఈ డబ్బులో 60 శాతం వీరు తీసుకుని స్థానికంగా సేవలు వినియోగించుకున్న టెక్నీషియన్‌కు 40 శాతం చొప్పున ఇచ్చారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గూగుల్‌లోని యాడ్‌ స్పేస్‌ నిర్వహణ చేసే ఉద్యోగులు, సాంకేతిక నిపుణులను విచారించాలని నిర్ణయించారు. ప్రధానంగా గూగుల్‌ మ్యాప్స్‌లో వీళ్లు లోకేషన్స్‌ను ఎలా మార్చగలిగారన్న అంశంపై ఆరా తీయనున్నారు. మరోపక్క తదుపరి విచారణ నిమిత్తం నిందితులు ఇద్దరినీ తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.   

(చదవండి: తప్పని పడిగాపులు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top