త్వరలో హైదరాబాద్‌ – డాలస్‌ విమానం | ncreased international connectivity from Hyderabad | Sakshi
Sakshi News home page

త్వరలో హైదరాబాద్‌ – డాలస్‌ విమానం

Dec 30 2024 4:04 AM | Updated on Dec 30 2024 4:04 AM

ncreased international connectivity from Hyderabad

హైదరాబాద్‌ నుంచి పెరిగిన ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీ

ప్రస్తుతం 20 నగరాలకు సదుపాయం

త్వరలో మరిన్ని నగరాలకు విస్తరణ

కొత్తగా వియత్నాం, అజర్‌బైజాన్‌. ఇథియోపియాకు విమానాలు

భాగ్యనగరం నుంచి అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం..  కేవలం ట్రాన్సిట్‌ ఎయిర్‌పోర్ట్‌గానే కాకుండా పశ్చిమాసియా దేశాలకు ప్రధాన హబ్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి గణనీయంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా పలు ఎయిర్‌లైన్స్‌ తమ విమాన సర్వీసులను విస్తరిస్తున్నాయి. 

ఏటా సుమారు 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణమైన సామర్థ్యంతో.. ఎయిర్‌పోర్ట్‌ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌ దేశంలోనే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా మారింది. దీంతో ప్రస్తుతం పలు అంతర్జాతీయ నగరాలకు  విమానాలను నడుపుతున్న విమానయాన సంస్థలు.. మరిన్ని కొత్త నగరాలకు తమ సేవలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 

కోవిడ్‌ అనంతరం అంతర్జాతీయ పర్యటనలు సైతం భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల పర్యాటకులు నచ్చిన దేశాలు, పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పర్యాటకుల డిమాండ్, అభిరుచి ఉన్న ప్రాంతాలకు సర్వీసులు  అందుబాటులోకి వస్తున్నాయి. సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు, శ్రీలంక, దుబాయ్‌ వంటి దేశాలతో పాటు  పర్యాటకులు సందర్శించే  జాబితాలో కొత్తగా మరిన్ని దేశాలు వచ్చి చేరాయి. అమ్‌స్టర్‌డ్యామ్, ఇథియోపియా, వియత్నాం, డాలస్, షికాగో తదితరాలకు హైదరాబాద్‌ నుంచి త్వరలో డైరెక్ట్‌ ఫ్లైట్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. –సాక్షి, హైదరాబాద్‌

హైదరాబాద్‌ నుంచి ఎక్కడెక్కడి కంటే..
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, దోహా, షార్జా, జెడ్డా, అబుదాబి, రియాద్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, ఖతార్, సౌదీ తదితరాలకు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. గతంలో షికాగోకు విమాన సర్వీసులను నడిపారు. కోవిడ్‌ కారణంగా నిలిచిపోయాయి. త్వరలో షికాగోతోపాటు డాలస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు కూడా హైదరాబాద్‌ నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.

 ప్రస్తుతం  హైదరాబాద్‌ నుంచి రోజూ సుమారు 55000 మంది దేశీయ, మరో 15000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్క నవంబర్‌ నెలలోనే 40,179 మంది హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశీయానం చేశారు. 2467 అంతర్జాతీయ సర్వీసులు నడిచాయి.

ఆసియా దేశాల్లో యూరప్‌ అనుభూతి
ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌ తదితర యూరప్‌ దేశాల పర్యటన ఖరీదుగా మారింది. నలుగురు కుటుంబసభ్యులు కలిసి వారం రోజుల పాటు పర్యటించాలంటే కనీసం రూ.8 లక్షల పైనే  ఖర్చవుతుంది. కానీ చాలా తక్కువ బడ్జెట్‌లో యూరప్‌ దేశాల్లో పర్యటించిన అనుభూతిని కలిగించేవిధంగా కొన్ని దేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జార్జియా, అజర్‌బైజన్, ఉజ్బెకిస్తాన్, ఆర్మీనియా తదితర దేశాలు.. తక్కువ బడ్జెట్‌లో సందర్శించేందుకు అనువుగా ఉన్నాయి. దీంతో ఈ దేశాలను  ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్నట్లు పర్యాటక సంస్థలు పేర్కొంటున్నాయి. 

‘స్విట్జర్లాండ్‌లోని మంచుకొండల్లో విహరించాలని కోరుకొనేవాళ్లు ఇప్పుడు కజకిస్తాన్‌లోని షింబులాక్‌ మౌంటెయిన్స్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌ పర్యటనకు కనీసం రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందనుకంటే.. కేవలం రూ.2 లక్షల్లోనే కజికిస్తాన్‌ పర్యటనను పూర్తి చేయవచ్చు. ఇలా బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూర్స్‌కు ప్రాధాన్యం పెరిగింది’.. అని వాల్మీకి ట్రావెల్‌ అండ్‌ టూరిజమ్‌ సొల్యూషన్స్‌ ఎండీ హరికిషన్‌ వాల్మీకి తెలిపారు. మరోవైపు ఉచిత వీసా సదుపాయం కలిగిన దేశాల్లో కూడా ఎక్కువమంది పర్యటిస్తున్నారు. మలేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు ఆ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 

త్వరలో రష్యా సైతం ఉచిత వీసా సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో ట్రావెల్స్‌ ఏజెన్సీలు, పర్యాటక సంస్థలు  ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు ఎయిర్‌లైన్స్‌ కూడా ఈ డిమాండ్‌ మేరకు సర్వీసులను విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్‌ఇండియా వంటి సంస్థలు తమ సర్వీసులను పెంచుతున్నాయి. 

ఆఫ్రికా దేశాలకు కనెక్టివిటీ..
కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్‌.. నెదర్లాండ్స్, ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ ఇథియోపియా తదితర దేశాలకు త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెట్టనుంది. ఇథియోపియాకు విమానసర్వీసులు  అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్‌ నుంచి ఆఫ్రికా దేశాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది. వియట్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ హైదరాబాద్‌ నుంచి వియత్నాంకు  విమానాలు నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. 

టర్కీకి కూడా డైరెక్ట్‌ కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. అమ్‌స్టర్‌డామ్, డల్లాస్‌ నగరాలకు కూడా 2025లోనే సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమానాలు నడుస్తుండగా, 2025లో మరో 10 నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement