
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 14కావడంతో ఈలోపే నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మంచి రోజుతోపాటు తిథులను చూసుకుంటున్నారు. తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుందని పండితులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 10, 12, 13, 14 తేదీల్లో వారాలతోపాటు తిథులు కూడా బాగున్నాయని, అయితే అభ్యర్థి జాతకాన్ని బట్టి కలిసివచ్చే రోజును ఎంచుకుంటుంటారని ఓ పండితుడు పేర్కొన్నారు.
ఈ నెల 10 సోమవారంతోపాటు పాడ్యమి ఉంది. 12వ తేదీ బుధవారం కావడంతోపాటు తదియ అవుతోంది. 13వ తేదీ గురువారం అయినా చవితి అవుతోంది. 14వ తేదీ శుక్రవారం మంచిరోజు కావడంతోపాటు ఆరోజు పంచమి ఉంది. కాబట్టి వారం, తిథి రెండూ బాగున్నాయి. 11వ తేదీ విదియ అయినా మంగళవారం కావడంతో ఆరోజు నామినేషన్ వేసేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 10వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం కాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 13వ తేదీ లేదా 14న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు.