చచ్చినా కాంగ్రెస్‌ను వీడను: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 MP KomatiReddy VenkataReddy Says He Will Not Leave Congress - Sakshi

పీసీసీ అధ్యక్ష పదవి భర్తీలో జాప్యం వల్లే నేతలు పార్టీ వీడుతున్నారు 

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ 

సాక్షి, జహీరాబాద్‌‌: కాంగ్రెస్‌ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, చచ్చినా పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేయడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. పీసీసీ పదవి భర్తీలో జాప్యం వల్లే కొంత మంది సీనియర్లు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలను సాకుగా చూపుతూ ఇంకా జాప్యం చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తోందని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top