మళ్లీ మావోల కలకలం! ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి 

Movement of Maoists from joint Adilabad to Khammam - Sakshi

ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు మావోయిస్టుల కదలికలు 

పోడు పట్టాలు, గిరిజన చట్టాల అమలుకు ఉద్యమించాలని పిలుపు 

సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ తూర్పు భాగం గుండా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యతి్నస్తున్నారు. అదే సమయంలో తూర్పు దిక్కున మావోలకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విక్రమ్‌ మాండవీ కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించి దాడికి తెగబడ్డారు. అయితే, ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

ఈ క్రమంలో మావోలు తెలంగాణలోకి వస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో వీరి కదలికలపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో వీరు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు పోలీసులు సరిహద్దుల వద్ద భద్రత పెంచారు.

అయితే, ఈసారి ఏప్రిల్‌ 20న జరగనున్న ఇంద్రవెల్లి అమరుల సంస్మరణను పురస్కరించుకుని ఉద్యమాలను నిర్మించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్‌ నినాదంతో ఉద్యమించిన ఆదివాసీల్లో 13 మంది పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనను ఉద్యమకారులు మరో జలియన్‌ వాలా భాగ్‌తో పోలుస్తారు. 

గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణే..! 
ఇంద్రవెల్లి వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తరచుగా కేంద్రంపై విమర్శలు, తమపై సాగే పోలీసు దాడులను నిలిపివేయాలనే సాధారణ డిమాండ్లను మావోయిస్టు పార్టీ ఈసారి వినిపించకపోవడం గమనార్హం. కేవలం ఆదివాసీలు, గిరిజనుల హక్కులు, వారి సంక్షేమానికి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, జీవోలను అమలు చేయాలని డిమాండ్‌ చేయడం విశేషం.

ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన, 1995 పెసా చట్టం, 2005 అటవీ హక్కుల చట్టం, కవ్వాల్‌ టైగర్‌ జోన్, అభయారణ్యాల ఎత్తివేత, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు, ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ, ఆదివాసీబంధు అమలు తదితర డిమాండ్లను మావోయిస్టులు ప్రభుత్వం ముందుంచుతున్నారు. చివరిగా.. ఎస్టీల్లో ఇతర కులాలను చేర్చవద్దని స్పష్టంచేశారు.  

ఎందుకు వస్తున్నట్లు..? 
మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు రాజకీయ, భౌగోళిక, వాతావరణ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం వేసవి కారణంగా అడవులు పలుచబడటం, ఆకులు రాలిపోవడంతో వీరు మరింత దట్టమైన అడవుల్లోకి లేదా తెలంగాణలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి. అదేసమయంలో గోదావరిలో నీటిప్రవాహం తగ్గడం వల్ల ఎంపిక చేసిన ప్రాంతాల్లో నదిని దాటడం సులభంగా ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం గతంలో చేసిన చట్టాలు, విడుదల చేసిన జీవోల అమలుకు ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మావోల వ్యూహంగా కనిపిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top