‘మంచు’కొస్తోంది

More Road Accidents In Winter Season Due Early Morning Fog In Hyderabad - Sakshi

శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు 

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యే ఎక్కువ    

సాక్షి, హైదరాబాద్‌: తెల్లవారుజాము...చల్లటి గాలులు...దట్టమైన పొగమంచు...నిర్మానుష్యమైన రహదారులు రోడ్డు ప్రమాదాలకు ‘దారి’తీస్తున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలను పొగమంచు కమ్ముకుంటోంది. శీతాకాలంలో జరిగే రోడ్డు  ప్రమాదాలకు  వాహనాల వేగంతో పాటు  దట్టంగా అలుముకొనే పొగమంచు కూడా  ప్రధాన కారణమవుతోంది. నగర శివార్లు, హైవేలపైన, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైన తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు  రహదారి భద్రత నిపుణులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం ప్రయాణాల్లో  సరైన జాగ్రత్తలు పాటిస్తే  ఇలాంటి  ప్రమాదాలకు గురి కాకుండా  క్షేమంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. 

ఆహ్లాదం మాటున ప్రమాదం ... 
సాధారణంగా ఉదయం పూట ప్రయాణం  ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మానుష్యంగా కనిపించే రహదారులపైన వేగం పెంచడం ఒక కారణమైతే  పొగమంచు వల్ల  రోడ్లు సరిగ్గా కనిపించకపోవడం మరో కారణం. ఉదయం  3 గంటల నుంచి 6 గంటల మధ్యే ఈ తరహా  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల అంచనా. ఈ సమయంలో 380 నుంచి  400 కు పైగా రోడ్డు  ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. చలికాలం డ్రైవింగ్‌ పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమని, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా  డ్రైవింగ్‌లో మెళకువలు పాటించాలని  డిప్యూటీ రవాణా కమిషనర్, రహదారి భద్రతా నిపుణులు డాక్టర్‌ పుప్పాల  శ్రీనివాస్‌ తెలిపారు.  

అప్రమత్తతే రక్ష... 
⇔ పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం సమయంలో రోడ్లపై కంటితో చూడగలిగే  దూరం తగ్గుతుంది. చెరువులు, లోతట్టు ప్రాంతాలు, ఎక్కువగా  చెట్లు , తోటలు ఉన్న  ప్రాంతాల్లో  పొగమంచు మరింత  ఎక్కువగా ఉంటోంది.

⇔ ఈ సమయంలో బండి నడిపేటప్పుడు  ఇతరులకు స్పష్టంగా  కనిపించేలా ఉండాలి. ఇందుకోసం  వాహనం లైట్లను వేసుకోవాలి. 

 చూడదగిన దూరానికి అనుగుణంగా బైక్, కారు వేగం ఉండాలి. ఉదాహరణకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు 70 మీటర్ల దూరాన్ని స్పష్టంగా చూడగలగాలి.  

⇔ హైవేలు, శివారు రహదారులపైన   వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలి. విండ్‌ స్క్రీన్‌పై  ఎప్పటికప్పుడు మంచును  శుభ్రం చేయాలి. ఇందుకోసం బండిలో 
డీఫ్రాస్టర్‌ వినియోగించాలి.  

ఇవీ చేయాల్సినవి
⇔   లోబీమ్‌ ఫాగ్‌ లైట్లు ఉండేలా చూసుకోవాలి.  
   పొగమంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే  సురక్షితమైన స్థలంలో వాహనం ఆపేయడం మంచిది. అది ఇతర వాహనదారులకు కనిపించే విధంగా ఉండాలి.  

లేన్‌ మరిచి పోవద్దు 
పొగమంచులో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు,  రహదారిపై ఉన్న లేన్‌ను  అనుసరించడం మంచిది. ఇది మీరు మీ లేనులోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఉత్తమ మార్గం. అంతేకాదు, మీరు జాగ్రత్తగా బండి నడుపుతున్నట్లు లెక్క. – డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ రవాణా కమిషనర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top