ఫోన్‌కాల్‌ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్‌వా.. లేక ఎర్రబెల్లివా?’

MLC Palla Rajeshwar Reddy Sister Agressive On Tahsildar - Sakshi

నేను చెప్పినా.. అన్న చెప్పినా ఒకటే !

ఎంపీపీ ఏమైనా ఎర్రబెల్లా.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా?

తహసీల్దార్‌తో ఎమ్మెల్సీ పల్లా సోదరి సరిత ఫోన్‌ సంభాషణ వైరల్‌

చివరకు తహసీల్దార్‌ బదిలీ

హన్మకొండ అర్బన్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్‌ విజయలక్ష్మికి ఫోన్‌లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్‌ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్‌ మధ్య సాగిన ఫోన్‌ సంభాషణ బుధవారం సోషల్‌ మీడి యాలో వైరల్‌గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు.

‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్‌ రిలీజ్‌ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్‌ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్‌ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్‌ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్‌రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట.  పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్‌ విజయలక్ష్మిని కలెక్టరేట్‌కు బదిలీ చేయడం కొసమెరుపు.

చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్‌డౌన్‌ సడలింపులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top