సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా వివాదంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొచ్చి చూపిస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తేదీ, సమయం చెప్పండి.. ఎన్నికల సంఘం రికార్డులతో సహా వాస్తవాలను నిరూపిస్తా అని ప్రకటించారు. పోలీసు బలగాలతో అరెస్టులు చేయించడం కాదని, ఓట్లు తొలగించబడ్డాయని చెబుతున్న బాధితులను నేరుగా తీసుకొచ్చి చూపిస్తానని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పొన్నం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ నేతలపై మండిపడ్డారు. ‘సర్’పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటును కూడా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని పొన్నం తెలిపారు. తన తండ్రి పేరు సత్తయ్య, సత్యనారాయణ గౌడ్ అని వేర్వేరుగా ఉండటాన్ని సాకుగా చూపించారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు తొలగించారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లనే తొలగించారని విమర్శించారు.
పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మంత్రి అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికే ఇబ్బందులు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారు? వాటిలో అనర్హుల ఓట్లు ఎన్ని? పొరపాటున అర్హుల ఓట్లు ఎన్ని తొలగిపోయాయి? అనే వివరాలను స్పష్టమైన లెక్కలతో బయటపెట్టాలని పొన్నం డిమాండ్ చేశారు. ఓటు హక్కుపై ప్రశ్నించే వారిని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ప్రాణం తీసిన రీల్స్ సరదా


