ఇక బోర్డుల వంతు 

Meetings Of Krishna And Godavari River Management Boards To Be Held Today - Sakshi

నేడు గోదావరి, రేపు కృష్ణా బోర్డుల భేటీల్లో ప్రాజెక్టుల అధీనంపై స్పష్టత 

సబ్‌ కమిటీ భేటీల్లో రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం 

గోదావరిలో ఒక్క పెద్దవాగుకే తెలంగాణ అంగీకారం.. మిగతా ప్రాజెక్టులపై ఏపీ పట్టు 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిపై సబ్‌కమిటీ స్థాయి భేటీలో ఏమీ తేలలేదు. బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంది. దీంతో తదుపరి నిర్ణయాలు పూర్తిస్థాయి బోర్డుల్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గోదావరి బోర్డు, మంగళవారం జరిగే కృష్ణా బోర్డు భేటీలు కీలకంగా మారాయి. ప్రాజెక్టుల అంశంతో పాటు సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు అం శాలపై వరుసగా జరగనున్న భేటీల్లోనే స్పష్టత రా నుంది.

ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ అమలు జరగనుంది. గెజిట్‌ అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం జలసౌధలో గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన, మధ్యాహ్నం కృష్ణా బోర్డు తరఫున రవికుమార్‌ పిళ్లై అధ్యక్షతన భేటీలు జరగ్గా, తెలంగాణ తరఫున సీనియర్‌ ఇంజనీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, విజయ్‌కుమార్, శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. ఒక్కో భేటీ సుమారు మూడు గంటలకుపైగా జరగ్గా, బోర్డు అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, బోర్డు అభిప్రాయాలు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. 

గోదావరి ఒక్కటే.. మిగతా వాటికి ఒప్పుకోం.. 
ఇక గోదావరి బోర్డు భేటీలో ప్రధానంగా ప్రాజెక్టుల పరిధిపై చర్చ జరిగింది. తెలంగాణ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని కోరింది. అయితే ఏపీ మాత్రం శ్రీరాంసాగర్‌ నుంచి సీతమ్మసాగర్‌ బ్యారేజీ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనే ఉంచాలని విన్నవించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనిపై పూర్తిస్థాయి భేటీలో చర్చిద్దామంటూ బోర్డు సర్దిచెప్పింది. ఇక పెద్దవాగు కింద 80% ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నందున దాని నిర్వహణకయ్యే వ్యయంలో 80% ఏపీనే భరించాలని కోరగా, దీనికి సానుకూలత లభించినట్లు తెలిసింది. మిగతా నిధు లు, సిబ్బంది, వాటికిచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలపై సోమవారం జరిగే బోర్డు భేటీలో స్పష్టత రానుంది. 

విద్యుదుత్పత్తి కేంద్రాలపై తెలంగాణ అభ్యంతరం
కృష్ణా బేసిన్‌లో జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో ఉంచాలన్న ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, సాగర్, పులిచింతల విద్యుత్‌కేంద్రాలు బోర్డుల పరిధిలో అక్కర్లే దని తెలంగాణ చెప్పినట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టును సైతం బోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. శ్రీశైలం మీద ఆధార పడి ఉండే కల్వకుర్తి, నాగార్జునసాగర్‌ హెడ్‌ రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, సాగర్‌ పరిధిలోని వరద కాల్వ, ఆర్డీఎస్, దాని పరిధిలోని తుమ్మిళ్ల, సిద్ధనాపూర్‌ కాల్వ, ఆర్డీఎస్‌ హెడ్‌రెగ్యులేటర్‌లనే బోర్డు ఆధీనంలో ఉంచేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం.

ఇక ఏపీ బనకచర్లతోపాటు దానికింద ఉన్న ఔట్‌లెట్‌లు మినహా శ్రీశైలం పరిధిలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ముచ్చుమర్రి, హెడ్‌ రెగ్యులేటర్‌లు, పవర్‌హౌస్, పోతిరెడ్డిపాడు, సాగర్‌ కింది కుడి కాల్వ, పులిచింతలను బోర్డు పరిధిలో ఉంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ అధికారులు తెలంగాణ పవర్‌హౌస్‌లు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టు బట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో అభిప్రాయం కావడంతో బోర్డుల భేటీల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top