హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్‌కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు.
భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్‌చల్ చేశారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


