ఎకరాకు 26 కింటాళ్ల పంటనే కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్
దీంతో తక్కువ ధరకు ప్రైవేట్‌కు అమ్ముకుంటున్న రైతులు
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటూ నామమాత్రమే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, సిద్దిపేట: మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో 12.94 లక్ష ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. దాదాపు 39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 226 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 28,041 మంది రైతుల దగ్గర నుంచి 1,46,900 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
పంట దిగుబడి బాగుందని సంతోషించేలోపే డిమాండ్ తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1,700కు మించడం లేదు. దీంతో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేస్తోంది. కానీ అరకొరగానే కేంద్రాలు ఏర్పాటు చేయడం, అవి కూడా అవసరమైన ప్రాంతాల్లో కాకుండా దూరంగా ఏర్పాటు చేయడం.. ఆపై తేమ శాతం నిబంధనతో రోజుల తరబడి ఆరబెడుతూ రైతులు ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కొణిజర్ల, సోమవారం బోనకల్ మండలం ముష్టికుంట్లలో రైతులు రాస్తారోకో చేశారు. యాసంగిలో మొక్కజొన్న ఎకరాకు 40 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని నిబంధన విధించింది. దీంతో నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో చాలామంది రైతులు ధర తక్కువ అయినా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించారు.
అమ్ముకోవడానికి అవస్థలు..
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన పండగ కొండలరావు యాసంగిలో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సొగు చేశాడు. రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే ఈదురుగాలులు, వర్షాలతో కంకి దశలో నేలమట్టమైంది. అయినా ఎకరానికి రూ.10 వేల చొప్పున 12 ఎకరాలకు రూ.1.20 లక్షలు కూలి చెల్లించి పంట కోయించి మొక్కజొన్న కల్లంలో ఆరబోసి 20 రోజులైంది.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాక రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో స్థానిక సొసైటీకి కొనుగోలు కేంద్రం ఇచ్చినా, ఈసారి 5 కి.మీ. దూరంలోని బోనకల్‌కు కేటాయించారు. అక్కడకు తీసుకెళ్లాలంటే ఎకరా పంటక రూ.3 వేలు అదనంగా ఖర్చవుతుందని వాపోతున్నాడు.
వారమైనా తూకమేదీ?
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు ఎర్రోళ్ల విజయ. ఈమెది సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం. వారం రోజుల క్రితం మక్కలను సిద్దిపేట మార్కెట్‌కు తీసుకొచ్చింది. శనివారం కొనుగోలు చేస్తామని ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు తూకం వేయలేదు.


