రెండో రోజూ కొనసాగిన కసరత్తు

Manickam Tagore Talks With Leaders Selection Of TPCC Chief - Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై నేతలతో మాణిక్యం ఠాగూర్‌ మంతనాలు

మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో భేటీ

ఏఐసీసీ కార్యదర్శులు, సభ్యులతో విడివిడిగా అభిప్రాయ సేకరణ

నేడూ కొనసాగనున్న ప్రక్రియ.. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌! 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చేపట్టిన అభిప్రాయ సేకరణ వరుసగా రెండో రోజూ కొనసాగింది. రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ గురువారం కూడా గాంధీభవన్‌లోనే మంతనాలు జరిపారు. కోర్‌ కమిటీ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం కూడా కొనసాగనుంది.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆయన శుక్రవారం సమావేశమవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ అందరితో చర్చలు పూర్తయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నివేదికను తీసుకుని ఆయన శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత అధిష్టానం స్థాయిలో కసరత్తు పూర్తయి కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. ఇందుకు ఈనెలాఖరు వరకు పడుతుందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.  చదవండి: (నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌)

నాకు అవకాశం ఇస్తే పార్టీని నిలబెడతా
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశమివ్వాలని పార్టీని కోరానని, అధిష్టానం అనుమతినిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ నిలబెడతానని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న తనకు అధిష్టానం ఈ అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను గాంధీభవన్‌లో గురువారం కలిసి టీపీసీసీ అధ్యక్ష ఎంపికపై తన అభిప్రాయా న్ని తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మా ట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తే టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, సీఎం కేసీఆర్‌ అసమర్థతపై జనంలోకి వెళతానన్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నానన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి 2023లో పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.   చదవండి:  (సిద్దిపేటలో ఎయిర్‌పోర్టు : కేసీఆర్‌)

అంజన్‌కుమార్‌ రాజీనామా..
గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి అంజన్‌కుమార్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. గురువారం గాంధీభవన్‌లో మాణిక్యం ఠాగూర్‌ను కలసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం అంజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే అపనింద పడటం ఇష్టం లేకనే రాజీనామా చేశానన్నారు. తనకు ప్రమోషన్‌ కావాలని పార్టీని అడిగానని, పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమివ్వాలని కోరినట్టు వెల్లడించారు. తాను సికింద్రాబాద్, హైదరాబాద్‌కు మాత్రమే అధ్యక్షుడినని, గ్రేటర్‌కు కాదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు.

తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో పోనని స్పష్టం చేశారు. కాగా, గురువారం మాణిక్యం ఠాగూర్‌ను కలసి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తమ అభిప్రాయాలను చెప్పిన వారిలో కోర్‌ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్, వంశీచందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top