మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య

Mancherial Municipal Commissioner Balakrishna Wife committed Suicide - Sakshi

ఆదిలాబాద్: మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి(32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ స్థానిక ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో భార్య, కుమారుడు రిత్విక్, కూతురు భవిష్యలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్‌ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. జ్యోతి మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించాడు. మంచిర్యాల డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ భార్య కావడంతో చైర్మన్‌ పెంట రాజయ్య, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

ఆత్మహత్య కాదు.. హత్యే..!
జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళనకు దిగారు. ఉదయం తమ కూతురు వీడియో కాల్‌ చేసి మాట్లాడిందని, చంపేసేలా ఉన్నాడని రోదించిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్‌ ఉద్యోగం చేసేవాడని, 2014, ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ.2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తెలిపారు. కమిషనర్‌గా ఎంపికైన తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయని, తాను కమిషనర్‌నని, ఎక్కువ కట్నం వచ్చేదంటూ వేధించేవాడని ఆరోపించారు. పలుమార్లు కుటుంబ పెద్దల సమక్షంలో మందలించినట్లు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నారాయణ్‌నాయక్‌ తెలిపారు.

అమ్మా.. ఏమైంది..!
మంచిర్యాలటౌన్‌: ఉన్నత ఉద్యోగి భార్య.. కుమారుడు, కూతురుతో హాయిగా జీవితం సాగిపోతోంది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను రోజూ మాదిరిగా సిద్ధం చేసి, టిఫిన్‌ బాక్సు పెట్టి నవ్వుతూ టాటా చెప్పి బడికి పంపించింది. ఏం జరిగిందో గానీ మధ్యాహ్నం వరకు ఆ తల్లి విగతజీవిగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు రిత్విక్, భవిష్య ‘‘అమ్మా.. ఏమైంది..’’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. ‘‘అమ్మా లే అమ్మా... ఏమైంది అమ్మా.. ఎందుకు లేస్తలేవు..’’ అంటూ తల్లి మృతదేహం వద్ద విలపించారు.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top