అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్‌

Man Assassinated Over Two Years Back Msg Issue At jangaon - Sakshi

సాక్షి, జనగామ: రెండేళ్ల క్రితం పంపిన ఓ మెసేజ్‌.. యువకుడి హత్యకు దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు కత్తిగాట్లకు బలయ్యాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పక్కాప్లాన్‌తో మద్యం తాగేందుకు రప్పించి.. అదును చూసి కీచైన్‌ కత్తితో దారుణంగా చంపేశారు. ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన ఈఘటన ‘ఇండస్ట్రియల్‌ ఏరియాలో హత్య’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈహత్యకు సంబంధించి సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ మూలబావికి చెందిన పకీరు రమేశ్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్లో పనిచేస్తున్నాడు.

అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ వివాహిత ఫోన్‌కు రెండేళ్ల క్రితం అసభ్యకర మెసేజ్‌ పంపించాడు. దీంతో ఆమె భర్త ఇండస్ట్రియల్‌ ఏరియాలోని దీప్తి ఇంజనీరింగ్‌ వర్క్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న పగడాల సందీప్‌ రమేశ్‌ను మందలించాడు. కాళ్లు మొక్కి తప్పు ఒప్పుకోవడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. తన అన్నతో కాళ్లు మొక్కించారనే కోపంతో రమేశ్‌ తమ్ముడు పకీరు సురేశ్‌ సందీప్‌కు ఫోన్‌కు చేసి నిలదీశాడు. దీంతో పాటు మెసేజ్‌ గురించి తెలిసిన వారందరికీ చెప్పాడు.

అనంతరం రమేశ్‌ తన తమ్ముడు సురేశ్, సందీప్‌ ఇద్దరినీ పిలిచి కాంప్రమైజ్‌ చేశాడు. అక్కడితో గొడవ ముగియగా.. మూడ్రోజుల క్రితం సురేశ్‌ మరోసారి సందీప్‌కు ఫోన్‌ చేసి అదే విషయం గురించి మాట్లాడాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటారా అని పగ పెంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి సందీప్, సురేశ్, మరో స్నేహితుడు విజయ్‌ ముగ్గురు కలిసి మద్యం తాగారు.

ఇక్కడే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తాగిన మైకంలో సందీప్‌ తన వద్ద ఉన్న కీచైన్‌ కత్తితో సురేశ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పొడిచి, మెడకోసి చంపేశాడు. ఫిర్యాదు మేరకు సీఐ  కేసు నమోదు చేసుకుని విచారణ సాగించారు. సందీప్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌ తండ్రి పకీరు చంద్రయ్యను విట్నెస్‌గా చూపించి, సందీప్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు. 
చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top