
రైతు కమిషన్ నూతన చైర్మన్ కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందుబాటులో ఉంటానని వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో బుధవారం వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం రెండూ చాలా ముఖ్యమైనవని, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ఎన్జీవోలు తగు సూచనలు చేయాలని కోరారు.
శక్తివంచన లేకుండా వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు.
సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మరోవైపు రాబోయే పంట కాలానికి రైతు భరోసా కింద అర్హులైన రైతులకు పెట్టుబడిగా రూ.7500 ఆర్థిక సాయం చేస్తామని సీఎం ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు.