రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు: సీఎం కేసీఆర్‌

KCR Speak On New Revenue Bill In TS council 6th Day Assembly Session - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి, కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశామని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని పేర్కొన్నారు. దీంతో పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సోమవారం ఆరో రోజు తెలంగాణ వర్షాకాల శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించారు. దీంతో మండలిలో కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ధరణి ఒక్కటే కాదు, మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని వెల్లడించారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ధరణి ఒక్కటే కాదని.. మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, కార్మికుల ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రధానిని కోరామని చెప్పారు. కారుణ్య నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. అర్హులుంటే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top