ఈసీ ఫేవరేట్‌ మహంతి: ప్యామిలీలో ఐపీఎస్‌లు ఎందరో..!

Karimnagar CP Abhishek Mohanty here is details of family IPS officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ డీసీపీ–1గా పనిచేస్తున్న 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతిని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారాయుడిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో నియమించే అధికారులకు సంబంధించి వచ్చిన  జాబితాను పరిశీలించిన ఈసీ అభిషేక్‌ మహంతి పేరును ఖరారు చేసింది.

ఎన్నికల సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టింగ్‌ ఇవ్వాలంటే ఈసీ ఆయా అధికారులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి సమర్థతతో పాటు నిజాయతీ తదితరాలను చూసిన తర్వాతే ఖరారు చేస్తుంది. గత ఏడాదే తెలంగాణ కేడర్‌కు వచ్చిన అభిషేక్‌ మహంతి  2019లో ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో ఉన్నారు. 2019 నాటి ఏపీ ఎన్నికల సమయంలో ఈయన తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏపీలో పనిచేసిన ఎస్పీలపై ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వివిధ జిల్లాల వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కడప ఎస్పీగా అభి మహంతిని నియమించింది. 

ఆ కుటుంబంలో ఎన్నో ‘ఎన్నికల పోస్టింగ్స్‌’ 
అభిషేక్‌ మహంతితో పాటు ఆయన కుటుంబంలో కూడా ‘ఎన్నికల పోస్టింగ్స్‌’ సాధారణ అంశంగా మారడం గమనార్హం. అభిషేక్‌ తండ్రి అజిత్‌ కుమార్‌ మహంతి (ఏకే మహంతి) 1975 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఈయన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గానూ పని చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన ఈసీ ఆ స్థానంలో ఏకే మహంతిని నియమించింది. ఇక అభిషేక్‌ మహంతి సోదరుడు అవినాష్‌ మహంతి కూడా 2005 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఈయన ప్రస్తుతం సైబరాబాద్‌లో పరిపాలన విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.

అవినాష్‌ మహంతికి కూడా గతంలో ఇదేవిధంగా ఎన్నికల పోస్టింగ్‌ వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్‌లోని రేవంత్‌ ఇంటిపై పోలీసులు చేసిన దాడి తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) డీసీపీగా పనిచేస్తున్న అవినాష్‌ మహంతిని నియమించింది. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీసీఎస్‌కే తిరిగి వచ్చారు. 

మహంతి ఫ్యామిలీలో ఎందరో ఐపీఎస్‌లు 
ఏకే మహంతి మామ (భార్య తండ్రి) దామోదర్‌ చోట్రాయ్‌ తొలి సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌ అయిన 1948 బ్యాచ్‌ ఒడిషా కేడర్‌ అధికారి. డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఏకే మహంతి బావమరిది పీకే సేనాపతి 1967 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఒడిషా కేడర్‌లోనే డీజీపీగా రిటైర్‌ అయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top