మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు

IT Raids On Malla Reddy: IT Issued Notices t To 10 Others - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్‌ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే.

మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్‌తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. 

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: 
రాజశేఖర్‌ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్‌డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. 
చదవండి: టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top