సంచికి మూడు కిలోలు

Irregularities In Paddy Weight In Nizamabad - Sakshi

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకవతవకలు

సాక్షి, భీమ్‌గల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకవతవకలు వెలుగు చూస్తున్నాయి. కడ్తా రూపంలోనే కాదు.. తూకంలోనూ మోసాలు బయట పడుతున్నాయి. 40 కిలోల సంచికి మూడు కిలోలు ఎక్కువగా కాంటా వేస్తున్నట్లు తాజాగా వెలుగు చూసింది. భీమ్‌గల్‌ మండలంలోని పల్లికొండ గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలను రైతులు ఆదివారం వెలికి తీశారు. 15 రోజుల క్రితం ముచ్కూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నాలుగు ఎల్రక్టానిక్‌ కాంటాల ద్వారా నిత్యం ధాన్యం తూకం వేసి, లారీలలో మిల్లర్లకు పంపిస్తున్నారు. అయితే, ఆదివారం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి తూకం వేసిన ఓ రైతుకు కాంటా తీరుపై అనుమానం వచ్చింది. తనకు వచ్చిన దిగుబడి ప్రకారం సుమారు 600 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా, 407 బస్తాలు మాత్రమే రావడంతో ఆ రైతు ఖంగు తిన్నాడు. దీంతో నిర్ధారణ కోసం ఒక బస్తాను మోటార్‌ సైకిల్‌పై గ్రామంలోని రైస్‌ మిల్లుకు తీసుకువెళ్లి తూకం వేయగా 40 కిలోల స్థానంలో 43 కిలోల బరువు వచ్చింది. 40 కిలోల బస్తాకు 3 కిలోలకు పైగా తేడా రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.  

ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ఇతర రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రైతుల సమక్షంలో కేంద్రంలోని నాలుగు కాంటాలను తనిఖీ చేసారు. మూడు కాంటాలలో తూకం సమానంగా రాగా, ఒక కాంటాలో మాత్రం బస్తాకు 3 కిలోల వరకు తక్కువ వస్తున్నట్లు గుర్తించారు. రైతుల ఆందోళన విషయం తెలిసి తహసీల్దార్‌ రాజేందర్, ఆర్‌ఐ ధనుంజయ, సొసైటీ చైర్మన్‌ అక్కడకు వచ్చారు. ఏం జరిగిందో ఆరా తీశారు. అలాగే, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడారు. సాంకేతిక లోపం కారణంగా నష్టం జరిగినందున, నష్టపోయిన రైతులకు సంచికి 3 కిలోల చొప్పున తిరిగి ఇప్పించేందుకు ఒప్పించారు. గత 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం ట్రక్‌ షీట్‌ను, మిల్లుకు అప్పగించినపుడు లారీ ధర్మకాంటా రసీదును బేరీజు వేయాలని, వచ్చిన తేడాను ఆ లారీలో ఏయే రైతుల దాన్యం వెళ్లిందో గుర్తించి వారి ఖాతాలో వేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా వివారలన్నీ రెండు రోజుల్లో సేకరించి, రైతులను సమావేశపరిచి వెల్లడిస్తానని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు. తేడా ఉన్న తూకం యంత్రాన్ని సీజ్‌ చేసి వెంట తీసుకెళ్లారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top