
ధాన్యానికి కిలోకు 69 పైసలు పెంపు
ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు తక్కువగా..
తక్కువ సాగయ్యే పంటలకు మోస్తరుగా మద్దతు ధర
నిరుటితో పోలిస్తే 15–20 శాతం పెరిగిన పెట్టుబడి ఖర్చులు
మద్దతు ధరలు పెంచింది కేవలం 3–10 శాతమే.. ఏడాదిలో ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర దక్కలే
రైతులు, రైతు సంఘాల ఆక్షేపణ
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి పంట. దీనికి ఈసారి మద్దతు ధరను క్వింటాకు రూ.69 (కిలోకు 69 పైసలు) మాత్రమే పెంచడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరా సాగుకు రూ.28 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు వచ్చిందని చెబుతున్నారు. కూలీల వేతనాలు, ఎరువులు, పురుగుమందుల ధరల్లో పెరుగుదలతో ఈ ఏడాది ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.42 వేల వరకు ఖర్చు రానుందని అంచనా వేస్తున్నారు.
సాక్షి, అమరావతి: పంటలకు ‘మద్దతు ధర’ ఏటా ఓ ప్రహసనంగా మారుతోంది. తాజాగా 2025–26 సీజన్‌కు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటనపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు చాలా స్వల్పంగా, అతి తక్కువగా పండించేవాటికి అరకొరగా మద్దతు ధర పెంచడం పట్ల మండిపడుతున్నారు. ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలకు.. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. పైగా పంట చేతికొచ్చే సమయంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.
కంటితుడుపుగా..
ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలు వెల్లడించింది. అత్యధికంగా సాగయ్యే వరికి నిరుటితో పోలిస్తే సాధారణ, గ్రేడ్–ఎ క్వింటాకు రూ.69, మొక్కజొన్నకు రూ.175 పెంచింది. జొన్నలు రూ.328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, కందులు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించారు.
పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఇది తక్కువేనని రైతులు పెదవి విరుస్తున్నారు. కూలీల కొరతతో కోతలు, నూర్పిళ్లకు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడాల్సి వస్తోందని... పెట్రోల్ ధరల కారణంగా వీటి అద్దెలు భారీగా పెంచేశారని చెబుతున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రధాన పంటలకు సగటున ఉత్పత్తి ఖర్చులు ఎకరాకు 10–15 శాతం మేర అధికమయ్యాయి. ఆ స్థాయిలో మాత్రం మద్దతు ధరలు పెంచడం లేదని మండిపడుతున్నారు.
వీటికి ఒక్క శాతానికి మించలేదు..
ప్రధాన వాణిజ్య పంట అయిన మొక్కజొన్న సాగుకు నిరుడు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ఖర్చు వచ్చింది. ఈ ఏడాది రూ.35 వేలు అవుతోంది. అంటే.. దాదాపు రూ.15 వేలు అధికం. పెరిగిన మద్దతు ధర మాత్రం 7.8 శాతమే. అపరాల పంటలన్నింటికీ పెట్టుబడి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికం కానుండగా.. ఆ స్థాయిలో మద్దతు ధర పెంపు లేదని రైతులు విమర్శిస్తున్నారు. కందికి 1.1 శాతం, పెసరకు 0.9 శాతం, సజ్జకు 0.34 శాతం మాత్రమే పెంచడం గమనార్హం.
ఏటా ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు దక్కడం లేదు. ఉదాహరణకు మినుములుకు రూ.7,400 కాగా రూ.7 వేలకు మించి కొనలేదు. వేరుశనగ రూ.6,783కు గాను దక్కింది రూ.5,500. చిరు ధాన్యాలకు సైతం క్వింటాకు రూ.2,500 దాటి ఇవ్వలేదు. కందులు మద్దతు ధర రూ.7,550 కాగా కొనేవారే కరువయ్యారు.
ధాన్యానికి మద్దతు ధర పెంపు 3 శాతమా?
గత ఏడాది ధాన్యం సాధారణ, ఏ గ్రేడ్ రకాలకు క్వింటాకు రూ.117 చొప్పున పెంచిన కేంద్రం ఈ ఏడాది మాత్రం ఆశలపై నీళ్లు చల్లింది. నిరుడు ప్రకటించిన ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా, రూ.1,100–రూ.1,400 మధ్య ధర పలికింది. మేలు రకాలకు సైతం రూ.1,400కు మించి దక్కలేదు. అంటే, మద్దతు ధరలోనే 30–40 శాతం మేర రైతులు నష్టపోయారు.
కనీసం ఈ ఏడాదైనా క్వింటాకు రూ.500 తక్కువ కాకుండా పెంచుతారని భావించారు. కానీ, అన్నదాతల ఆశలను అడియాశలు చేస్తూ నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మద్దతు ధర పెంపును 3 శాతానికి పరిమితం చేశారు. అంటే కిలోకు 69 పైసలకు మించలేదు. ఇలాగైతే బతికేది ఎలాగంటూ ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి ఖర్చులకు, పెంపునకు సంబంధం ఉందా?
పెట్టుబడులు అన్ని పంటలకు ఒకేలా పెరుగుతున్నాయి. దీనికి... ప్రకటించిన మద్దతు ధరలకు ఏమాత్రం సంబంధం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండేది వరి. కానీ, ధాన్యం క్వింటాకు రూ.69 మాత్రమే పెంచడం దారుణం. పెసరకూ గత సంవత్సరం కంటే తక్కువ పెంచారు. మిగిలిన పంటలకు గత ఏడాది కంటే ఎంతో కొంత పెంపునకు అనుమతి ఇచ్చారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్