సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ రోజు (శనివారం) అతనికి సంబంధించిన కెనరా బ్యాంకు లాకర్లను తెరిచింది. ఆ లాకర్‌లో రూ. కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులపై లోతైన విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఇటీవల సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో నరహరికి రూ.100కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తులు.. నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29 కోట్లు గుర్తించారు. దీంతో పాటు రూ.5.04 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్‌లో విలువైన ఫ్లాట్లు,గచ్చిబౌలిలో జీప్లస్ 3, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనాలు గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.


