స.హ.చట్టం.. అధికారులే అడ్డుగోడలు..

International Right To Information day Special Story - Sakshi

నేడు అంతర్జాతీయ సమాచార హక్కు దినం  

సాక్షి, సిరికొండ: పాలనలో పారదర్శకతకు బాటలేయాలి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.. అవినీతిని కాగడపెట్టి తరిమేయాలి.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలి.. అనే సంకల్పంతో అమలులోకి వచ్చిన ఏకైక చట్టం సమాచార హక్కు చట్టం. కానీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స.హ చట్టం అమలుకోసం ఏర్పడిన సమాచార కమిషన్‌ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. సాధారణ సమాచారం అయితే ఇస్తున్నారు కానీ అవినీతి గల సమాచారం లోపాలు గల సమాచారం ఇవ్వడం లేదు. స.హ చట్టం దరఖాస్తుదారుడు తమకు శత్రువైనట్లు వ్యవహరిస్తున్నారు.  ఫలితంగా పాలన పారదర్శకత కొరవడి ప్రజలకు న్యాయం జరగడం లేదనేది నగ్నసత్యం. చదవండి: (నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!)

ఉమ్మడి జిల్లాలో రూ.68,500 జరిమానా.. 
సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు, కానీ స.హ.చట్టం కింద రుసుములు చెల్లించి సమాచారం అడిగే వారికి సెక్షన్‌ 7(1) ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వడం లేదు. మొదటి అప్పీలు చేసిన స్పందన లేకపోవడంతో సమాచార కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సదరు అధికారులకు కమిషన్‌ నోటీసులు పంపించి విచారించి దురుద్దేశ్యపూర్వకంగా సమాచారం ఇవ్వకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి గత ఎనిమిదేండ్లలో 1131అప్పీళ్లు, 773ఫిర్యాదులు అందగా.. 983అప్పీళ్లు, 599 ఫిర్యాదులు పరిష్కరించి 20మంది అధికారులకు రూ. 68,500 జరిమానాలు విధించారు. మున్సిపాల్టీలు, విద్యాశాఖ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీ కార్యాలయాలకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తున్న సమాచారం ఇవ్వడం లేదు.

అధికారులే అడ్డుగోడలు.. 
స.హ.చట్టం సెక్షన్‌7(1) ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం కోసం అధికారులు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. అవగాహన లేమితో సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ కార్యాలయంలో సమాచారం లేకపోతే సెక్షన్‌ 6(3) కింద ఆ దరఖాస్తును 5రోజుల్లో సమాచారం గల కార్యాలయానికి పంపాలి. కాని తీరిగ్గా 30 రోజుల తరువాత దరఖాస్తును బదిలీ చేస్తున్నారు. మరికొందరు ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేస్తే ఇది సెక్షన్‌ 2(ఊ) ప్రకారం సమాచారం కిందకు రాదని దరఖాస్తును తిరిగి పంపిస్తున్నారు. సదరు జిల్లా పంచాయతీ అధికారులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. మరికొందరు అధికారులు సమాచారం కావాలంటే అధిక మొత్తంలో రుసుములు కట్టాలని ఆదేశిస్తున్నారు.

కొందరు అధికారులు సమాచారం కోసం దరఖాస్తు చేస్తే నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరికొందరు అధికారులు ఒక అడుగు ముందుకేసి మొదటి అప్పీలు వేసిన తరువాత రుసుములు కట్టమని అడుగుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్‌ 4(1) బి ప్రకారం 17అంశాల సమాచారం ప్రతి ఏడాది అప్‌డేట్‌ చేసి ఉంచాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో స.హ.చట్టం అమలు తీరు నామమాత్రంగా మారింది. 

ప్రభుత్వ కమిటీలు ఎక్కడ?.. 
ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమాచార కమిషన్‌ ఆదేశాల మేరకు ఉత్తర్వు నెంబరు 1185 అనుసరించి ప్రభుత్వ అధికారులు, ఇద్దరు ఉద్యమకారులతో కలిసి స.హ. చట్టం అమలు కోసం ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ నూతన జిల్లాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కమిటీలను ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్‌ జిల్లాలో కమిటీ కాలపరిమితి 2014 నవంబర్‌లో ముగిసిన ఇంతవరకు కొత్త కమిటీ ఏర్పడలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top