లుకలుకలు.. కుమ్ములాటలు | Internal strife in the three main parties in Telangana | Sakshi
Sakshi News home page

లుకలుకలు.. కుమ్ములాటలు

Jun 4 2025 2:12 AM | Updated on Jun 4 2025 7:34 PM

Internal strife in the three main parties in Telangana

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో అంతర్గత రగడ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో రచ్చ

అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలతో సతమతం 

కాంగ్రెస్‌లో తేలని కేబినెట్‌ విస్తరణ..ఆశావహుల నిరసన గళం 

పార్టీ పదవుల లొల్లి.. గాంధీభవన్‌లో మహిళా నేతల ధర్నా 

ఎమ్మెల్సీ కవిత రె‘బెల్స్‌’తో బీఆర్‌ఎస్‌లో దుమారం 

జాగృతి బలోపేతమంటూ పార్టీకి సమాంతరంగా కార్యకలాపాలు 

కమలంలోనూ కలహాలు..నేతల్లో కొరవడిన ఐక్యత..  

తలనొప్పిగా మారిన రాజాసింగ్‌ తీరు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. 

ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్‌ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్‌ఎస్‌లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం.  

కాంగ్రెస్‌లో పదవులు, ప్రాధాన్యం రభస 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్‌లో చర్చలు జరిగినా తేలడం లేదు. 

అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్‌లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్‌ నేతలు గాం«దీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్‌ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది.  

మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు 
సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. 

ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్‌ డౌన్‌ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.  

గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు 
బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్‌’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్‌ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్‌ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్‌కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్‌ఎస్‌లో అశాంతిని బహిర్గతం చేసింది. 

ఆ లేఖ లీక్‌ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్‌ఎస్‌నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్‌ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్‌ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్‌ మరింత పెంచారు.  

ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత 
మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్‌ఎస్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్‌ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్‌ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్‌ఎస్‌ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్‌కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. 

ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్‌ వెళ్లడం కూడా అటు బీఆర్‌ఎస్‌లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్‌ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్‌ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం.  

కమలం.. కలహాల కాపురం  
సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. 

ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్‌రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి.  

రాజాసింగ్‌ టార్గెట్‌ ఎవరో? 
రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్‌ స్టైల్‌ మార్చారు. 

ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్‌ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. 

తనను సస్పెండ్‌ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు  రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్‌ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌ అవుతోంది. 

ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement