60 రోజులకు సరిపడా నిల్వలు | no fuel shortage in hyderabad says cp vc sajjanar panic buying causes rush at petrol bunks | Sakshi
Sakshi News home page

60 రోజులకు సరిపడా నిల్వలు

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 11:13 AM

no fuel shortage in hyderabad says cp vc sajjanar panic buying causes rush at petrol bunks

సాక్షి,  హైదరాబాద్‌: నగరంలో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహలు, పెట్రోల్‌ బంక్‌ల వద్ద రద్దీ తదితర పరిణామాల  నేపథ్యంలో ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన, అదనపు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్, జాయింట్‌ సీపీ ఎన్‌.శ్వేతలతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జనర్‌ మాట్లాడుతూ.. ‘ఆయిల్‌ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్‌ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్‌ ట్యాంకులు చేయించుకోవడంతో డిమాండ్‌ పెరిగింది. ఈ కారణంగానే కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. దీన్ని కొరతగా భావించవద్దు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడు కాగా... కొరత వదంతుల నేపథ్యంలో 23న 6,400 కిలో లీటర్లకు చేరుకుంది’ అన్నారు.

ప్రజల భయాందోళనతోనే..
‘ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్‌ పెట్రోల్‌ లేదా డీజిల్‌ విక్రయించే బంకులపై చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియాలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచాం. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కమిషనరేట్‌ పరిధిలోని 240 పెట్రోల్‌ బంకుల్లో పరిస్థితిని సివిల్‌ సప్‌లైస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’ అన్నారు. 

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ.. ‘ఆయిల్‌ సంస్థలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోంది. ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement