ప్రేమకు అడ్డొస్తోందని.. | Anju missing case mystery solved after a year | Sakshi
Sakshi News home page

ప్రేమకు అడ్డొస్తోందని..

Mar 26 2026 2:32 AM | Updated on Mar 26 2026 3:45 AM

Anju missing case mystery solved after a year

కౌకూర్‌ భరత్‌నగర్‌లో అంజును పాతిపెట్టిన ఇల్లు

కన్న తల్లినే కడతేర్చిన కుమార్తె 

ఇంట్లోనే పాతిపెట్టిసిమెంటుతో పూడ్చివేత  

ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడిన వైనం  

ఏడాది తర్వాత వీడిన అంజు మిస్సింగ్‌ కేసు మిస్టరీ  

జవహర్‌నగర్‌: నవమాసాలు మోసి... గోరుముద్దలు తినిపించి... ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచి పెంచిన అమ్మను ఓ కూతురు ప్రియుడి మోజులో పడి కడతేర్చిన ఘాతుకం సమాజాన్ని నివ్వెరపరిచింది. తన ప్రేమకు అడ్డుపడుతోందని కన్న తల్లిని కత్తితో పొడిచి చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన అమా నుష ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బుధవారం మల్కాజిగిరి జోన్‌ డీసీపీ శ్రీధర్, జవహర్‌నగర్‌ ఏసీపీ చక్రపాణి, సీఐ సైదులు కేసు వివరాలను వెల్లడించారు. కౌకూర్‌ భరత్‌నగర్‌కు చెందిన అంజు(40) వృత్తిరీత్యా పనిమనిషి. ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.పెద్ద కుమార్తె రోషిణి వివాహమై వేరుగా నివాసముంటోంది. 

చిన్న కుమార్తె ఇంటర్‌ చదువుతున్న క్రమంలోనే బిహార్‌కు చెందిన డ్రైవర్‌ మోంటీ కుమార్‌సింగ్‌ (22) తో పరిచ యం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్‌ అమ్మాయిని వేధిస్తున్నాడని 2024 అక్టోబర్‌ నెలలో జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్, 2025లో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో మోంటీ కుమార్‌ సింగ్‌పై రెండు సార్లు పోక్సో కేసులు నమోదవడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. 

ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని..
తల్లి తమ ప్రేమకు అడ్డువస్తోందని, ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కూతురు, మోంటీ కుమార్‌ సింగ్‌ పథకం వేశారు. గతేడాది మే 12న అంజు ఇంట్లో ఉన్న సమయంలో కూతురు తల్లిని గట్టిగా పట్టుకోగా అక్కడే ఇంట్లో నక్కి ఉన్న మోంటీ కత్తితో అంజు ఛాతీపై పొడిచి విచక్షణా రహితంగా చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మంచం కింద దాచి, రక్తం మరకలు తుడిచారు. 

ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైన సిమెంట్‌ ఇసుకతో పక్కాగా పూడ్చిపెట్టారు. ఎలుకల వల్ల నేల పాడైందని నమ్మించి రిపేరు చేయించారు.ఈ క్రమంలో తన తల్లి కనిపించడంలేదని పెద్ద కూతురు రోషిణి 2025 అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసును మలుపుతిప్పిన స్కూటీ
హత్యకు గురైన అంజు పేరున ఓ ద్విచక్రవాహనం ఉంది. అంజు ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో తన స్కూటీని తీసుకుని వెళ్లి అదృశ్యమైందని అంజు పెద్దకూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గత కొద్దిరోజులుగా ఆమె పేరున ఉన్న స్కూటీ ఇతరుల పేరున మారడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన వారిని పిలిపించడంతో అసలు విషయం బయటపడింది. 

ఆ స్కూటీని అంజు చిన్న కుమార్తె, కుమార్‌సింగ్‌లు కలిసి తమకు అమ్మారని చెప్పడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చారు. జవహర్‌నగర్‌ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాన్ని ఒప్పుకున్నా రు. కాగా, హత్య తర్వాత నిందితులిద్దరూ కలిసి జీవిస్తూ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం వారికి రెండు నెలల కుమారుడున్నారని పోలీసులు తెలిపారు. 

కౌకూర్‌ భరత్‌నగర్‌లోని వారి నివాసంలో పాతిపెట్టిన మృతదేహాన్ని అల్వాల్‌ డిప్యూటీ తహసీల్దార్, ఉస్మానియా వైద్యుల సమక్షంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్‌ సీఐ సైదులు, ఎస్‌ఐలు రామ్‌నాయక్, వేణుమాధవ్, మమత, పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి జోన్‌ డీసీపీ శ్రీధర్‌ అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement