‘అమెరికా కలలు’భారత్‌ వైపు.. | Indian students are turning away from USA | Sakshi
Sakshi News home page

‘అమెరికా కలలు’భారత్‌ వైపు..

Oct 12 2026 5:25 AM | Updated on Oct 12 2026 5:25 AM

Indian students are turning away from USA

అమెరికా ఆశల నుంచి బయటపడుతున్న విద్యార్థులు

అగ్రరాజ్యంలో పెరుగుతున్న ఆంక్షలు... అడుగడుగునా నిఘా నేత్రాలు

పార్ట్‌టైం ఉద్యోగాలకూ కష్టంగానే... భారత్‌లో అవకాశాలపై ఆరా

మారుతున్న విదేశీ విద్య ట్రెండ్‌

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ విద్యార్థులు అమెరికా ఆశల నుంచి మెల్లగా బయటపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ రోజుకో నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు భారత్‌ వైపు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న అవకాశాలే మెరుగన్న రీతిలో యోచిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) 70 వేల డాలర్లు చేస్తానంటూ ట్రంప్‌ ప్రకటన చేసిన తర్వాత అగ్రరాజ్యంలో ఉద్యోగాలు కష్టమన్న భావన విద్యార్థుల్లో బలపడుతోంది. మరోవైపు విదేశీ విద్యార్థులపై యూఎస్‌లో నిఘా పెరుగుతోంది.

చదువు కోసమే వచ్చిన విద్యార్థులకు ఇబ్బంది లేదంటున్నారు. కానీ చదువుతూ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి ట్రంప్‌ తాజా నిర్ణయాలతో సమస్యలు తప్పవంటున్నారు. హెచ్‌1–బీ వీసా పొందిన వారిపైనా కత్తి వేలాడుతోందని ఎన్‌ఆర్‌ఐలు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నాయి.

ఆ వర్సిటీలపై దృష్టి
2022–23లో భారత్‌ నుంచి అమెరికాకు 2,68,923 మంది వెళ్తే, 2023–24లో ఈ సంఖ్య 3,31,602కు పెరిగింది. ప్రధానంగా ఐదు యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరుతున్నారు. వీటిపైనే అమెరికా అధికారులు ప్రత్యేక ని«ఘా పెట్టినట్టు తెలుస్తోంది. న్యూయార్క్‌ వర్సిటీ, నార్త్‌ ఈస్ట్రన్‌ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియో నిఘా జాబితాలో ఉన్నాయి. 

వీటి లక్షకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్‌ ఏంజెలిస్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. కొన్ని వర్సిటీలు వారానికి ఒక క్లాసు కూడా నిర్వహించడం లేదు. విద్యార్థులు మిగతా సమయంలో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. ఇలాంటి వారిని వెతికి పట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు. 

ఓపీటీ చిక్కులు
అమెరికాలో ఎంఎస్‌ రెండేళ్లల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు (స్కిల్డ్‌ మాత్రమే) చేసుకునేందుకు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఈ జాబితాలోనూ భారతీయులే ఎక్కువ మంది ఉంటారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం ఉండొచ్చు.

 ట్రంప్‌ సర్కార్‌ ఇప్పుడు దీన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే ఎంఎస్‌ పూర్తయిన వెంటనే అక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి భారత్‌కు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లేందుకు ఒక్కో విద్యార్థి సగటున రూ. 35 నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. భారత్‌ తిరిగి రావడం, ఇక్కడ ఉద్యోగం వెతుక్కోవడం, అప్పు తీర్చడం తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు వాపోతున్నారు.

అంత నిఘా ఎందుకో?
చదువు కోసం వచ్చిన ప్రతీ విద్యార్థిపై ఏఐ సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఆ విద్యార్థి ఎక్కడ నుంచి వచ్చాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్‌ ఎంత? వచ్చాక ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? అనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలాఉండగా, కన్సల్టెన్సీలు అడ్డగోలుగా విద్యార్థులను అమెరికాకు పంపుతున్నాయని అమెరికన్‌ విదేశీ రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకూ 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. విద్యార్థి అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన మొత్తాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. దీన్ని కన్సల్టెన్సీలు వివిధ మార్గాల్లో విద్యార్థి ఖాతాలో జమ చేస్తున్నాయి. ఈ వివరాలను అమెరికన్‌ కాన్సులేట్‌ సేకరించింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల పూర్తి వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర స్పెషల్‌ బ్రాంచీలు కూపీ లాగుతున్నాయి.

నిఘా పెరిగింది 
ఇండియా నుంచి వచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. భారత్‌లో బయల్దేరేటప్పుడు బ్యాంకుల్లో డబ్బులున్నట్టు చూపిస్తారు. కానీ వచ్చిన వెంటనే బ్యాంకు ఖాతాలో డబ్బులు ఎవరో విత్‌ డ్రా చేస్తారు. ఇవన్నీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి,
– విజయలక్ష్మి వింధ్యమూరి (అమెరికాలో భారత జాతీయురాలు)

ఓపీటీ భారమే 
రూ. 45 లక్షల అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్‌ టైం జాబ్‌ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తామంటున్నారు. ఇదే జరిగితే ఇండియా వెళ్లిపోవాలి. అక్కడా ఉద్యోగం వస్తుందో? రాదో? చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. 
– అఖిలేశ్‌ పూనాటి (అమెరికాలో ఎంఎస్‌ పూర్తయిన విద్యార్థి)

హెచ్‌1–బీకి తిప్పలే
ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడే అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియానే కాదు ఇతర ప్రాంతాల వారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్‌ వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్‌లో హెచ్‌1–బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్‌ (అమెరికాకు వెళ్లిన ఎంఎన్‌సీ ఉద్యోగిని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement