
అనుమతులకు మించి నిర్మాణాలు
రెండు భారీ షెడ్లు నేలమట్టం
మరిన్ని కట్టడాల వివరాల సేకరణ
గచ్చిబౌలి(హైదరాబాద్): సంధ్యా కన్వెన్షన్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. అనుమతులు లేని కట్టడాలను నేలమట్టం చేసింది. మంగళవారం ఉదయం నుంచి అధికారులు భారీ బందోబస్తు మధ్య రోజంతా కూల్చివేతలు జరిపారు. గచ్చిబౌలిలో సరనాల శ్రీధర్ రావు ఐదెకరాల విస్తీర్ణంలో 17 వేల చదరపు మీటర్ల అనుమతితో సంధ్యా కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. దీనిని ఆనుకొని ఉన్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని కొన్ని ప్లాట్లను కొనుగోలు చేశారు.
స్థలంలో కన్వెన్షన్‌ను ఆనుకొని రెండు షెడ్లను నిర్మించి కమర్షియల్‌గా వాడుకుంటున్నారు. రోడ్లను ఆక్రమించి ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారని ఫరి్టలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ల యజమానులు కొద్ది రోజులుగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లు కనిపించడం లేదని, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా శ్రీధర్ రావు నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. సదరు నిర్మాణాలను కూలి్చవేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సంధ్యా కనెవన్షన్‌కు కొనసాగింపుగా ఉన్నా బ్రైడల్ రూమ్‌లు, మినీ హాల్, రెస్ట్ రూమ్‌లను కూల్చి వేశారు.
మరో రెండు షెడ్లు సైతం..
గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 125లలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట లేఅవుట్ చేశారు. దాదాపు 162 ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు కొన్నింటిని సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు అమ్ముకున్నారు. మిగిలిన ప్లాట్లకు హద్దులు, రోడ్లు లేకపోవడంతో ఆ యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ క్రమంలోను ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో రెండు భారీ షెడ్లను నేలమట్టం చేశారు. సంధ్యా కన్వెన్షన్, మ్యాంగో ఫుడ్ పేరిట ఉన్న ఆర్చ్‌లను కూల్చివేశారు. కొన్ని ప్లాట్లను వేసిన సిమెంట్ రోడ్డును ధ్వంసం చేశారు. సొసైటీలోని యజమానుల నుంచి దాదాపు 100కు పైగా ప్లాట్లను సరనాల శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. ప్లాట్లు కనిపించకుండా మట్టి, బండరాళ్లు వేసి, నిర్మాణాలు చేపట్టి, ఆ తర్వాత సదరు ప్లాట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ రావుపై గచ్చిబౌలిపోలీస్ స్టేషన్‌లో కబ్జా యత్నం కేసులు నమోదై ఉన్నాయి.
మరిన్ని నిర్మాణాలపై ఆరా
నిర్మాణంలో ఉన్న రెండు షెడ్లను మాత్రమే అక్రమ నిర్మాణాలుగా తేల్చిన హైడ్రా అధికారులు మిగిలిన నిర్మాణాలు, యునాక్స్ అనే డ్రైవ్ ఇన్ వివరాలను సేకరిస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ ద్వారం వద్ద ఉన్న హోటల్, వెనక భాగంలో ఉన్న హార్ట్ కప్ అనుమతులను పరిశీలిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కాగా.. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు శ్రీధర్ రావుకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని నిర్మాణాలకు శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందించినట్లు విమర్శలున్నాయి.
15 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి
సుభా‹Ùనగర్: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో కబ్జాకు గురైన 15 ఎవరాల భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. సర్వే నం.354లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణల్ని మంగళవారం తొలగించింది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన ఐదు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని 2009లో ప్రభుత్వం రాజీవ్‌స్వగృహ నిర్మాణాలకు కేటాయించింది. ఆ నిర్మాణాల కార్యరూపం దాల్చకపోవడంతో స్థానికంగా నాయకులుగా చలామణి అవుతున్న కొందరి కన్ను ఈ భూమిపై పడింది. స్థలం చుట్టూ ప్రహరీలు నిర్మించిన వాళ్లు షెడ్లు వేసి ఆక్రమించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ప్రజావాణి ద్వారా ఫిర్యాదులందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారంచారు.
ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు నివేదిక సమర్పించారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆక్రమణలు తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆక్రమణలను మంగళవారం కూల్చేసిన అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. కాటేదాన్‌లోనూ హైడ్రా మంగళవారం కూలి్చవేతలు చేపట్టింది. ఇందిరా సొసైటీ కాలనీలోని రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించింది. రహదారులను ఆక్రమించి లేఔట్లలోని ప్లాట్లను కబ్జా చేసిన వారి ప్రయత్నాలను అడ్డుకుంది.
శ్రీధర్‌రావుపై ఫిర్యాదుల వెల్లువ..
శ్రీధర్ రావుపై పలు పోలీసుస్టేషన్లలో 30 కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా.. హైడ్రా కూల్చివేతల అనంతరం శ్రీధర్ రావు బాధితులు వివిధ మార్గాల్లో ఆయనపై ఫిర్యాదు చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. లేఅవుట్‌లోకి రాకుండా అడ్డుకున్నారని విదేశాల్లో ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొంది. కొందరు బాధితులు వీడియోల రూపంతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. లేఅవుట్‌లో ప్లాట్ లేదని చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ నుంచి ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై పలువురు శ్రీధర్ రావుపై ఫిర్యాదులు చేస్తున్నారు.