
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో విద్యుద్దీపాలంకరణ
మెరుస్తున్న రహదారులు
విద్యుద్దీపాల వెలుగులు
పాతబస్తీకి ప్రత్యేక సింగారాలు
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ముస్తాబు
మిస్ వరల్డ్ పోటీలతో ప్రత్యేక వాతావరణం
సాక్షి, సిటీబ్యూరో: మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం కొత్త తళులకులు అద్దుకుంటోంది. దాదాపు 120 దేశాల సుందరీమణులతో పాటు ఎందరెందరో వస్తున్న తరుణంలో నగరంలో రహదారులు మెరవాలని, రాత్రుళ్లు విద్యుత్ ధగధగలతో సిటీ మెరిసిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు, తుది మెరుగులతోపాటు డివైడర్లపై పేరుకుపోయిన దుమ్ము దులిపి రంగులు వేస్తున్నారు. లేన్ మార్కింగ్‌లతో పాటు కాలినడకల బాటలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు.

రోడ్లకిరువైపులా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం నుంచి మొదలు పెడితే, పోటీలను నిర్వహించే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వెళ్లే రహదారులను, అతిథులు బస చేసే హోటళ్ల మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. ఫ్లై ఓవర్ల క్రాష్ బారియర్స్‌కు, జంక్షన్లు, రోడ్ల వెంబడి కెర్బ్‌లకు పెయింట్స్ వేస్తున్నారు. రాత్రుళ్లు ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల విద్యుల్లతలతో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జంక్షన్లు, పోటీదారులు సందర్శించే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ ప్రత్యేక అలంకరణలు (Special Decoration) చేస్తున్నారు.
50 మార్గాల్లో పనులు
గ్రేటర్‌లోని దాదాపు 50 మార్గాలు ఈ పనులతో ప్రత్యేకంగా కనిపించనున్నాయి. సాధారణ రోజుల్లో జరగని పనులు ఈ సందర్భంగానైనా జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇవాంకా ట్రంప్ నగరానికి వచ్చిన సందర్భంగా పలు రోడ్లు అద్దాల్లా మారడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
చార్మినార్, లాడ్‌బజార్, ఫలక్‌నుమా ప్యాలెస్, మదీనా, సిటీ కాలేజీ, నయాపూల్, ఆరాంఘర్, మాసాబ్‌ట్యాంక్, గన్‌పార్క్, రేతిబౌలి జంక్షన్, ఐమ్యాక్స్ సర్కిల్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, తాజ్‌కృష్ణ, నాగార్జున సర్కిల్, కేబుల్ బ్రిడ్జి, ఓయూ కాలనీ క్రాస్‌రోడ్స్, ఐకియా జంక్షన్, టీహబ్, హైటెక్ సిటీ జంక్షన్, శిల్పారామం, బయో డైవర్సిటీ జంక్షన్, ఏఐజీ హాస్పిటల్ తదితర ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి.
స్పెషల్ డెకరేటివ్ లైటింగ్‌లో భాగంగా ఎల్‌ఈడీ పవర్ క్యాన్స్, స్ట్రిప్‌లైట్స్, సిరీస్ లైట్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో 300 మీటర్ల మేర ప్రత్యేక లాంతర్లతో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్ల ఆర్చ్‌లు ఏర్పాటు, ఎల్‌ఈడీలతో క్రౌన్, ‘ఫెయిరీ క్వీన్’ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు.
చదవండి: నాటి బికినీల పోటీ.. మిస్ వరల్డ్!
చెత్తా చెదారం.. దోమలు లేకుండా
చెత్త కనిపించకుండా వీధులు శుభ్రం చేసే కార్యక్రమాలు పెంచుతున్నారు. దోమలు లేకుండా నిల్వ నీరు లేకుండా చూడటంతో పాటు యాంటీలార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ ముమ్మరం చేశారు. రాత్రివేళ దోమలు కుట్టకుండా ప్రత్యేకంగా రెపెల్లెంట్ క్యాండిల్స్ తెప్పిస్తున్నారు. చార్మినార్– చౌమహల్లా ప్యా లెస్ మార్గంలో హెరిటేజ్ వాక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.