
హైదరాబాద్: విదేశీ యువతిని నిర్బంధించి వ్యభిచార కూపంలోకి దించిన ముఠా సభ్యులను పాతబస్తీ బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ ఢాకా కు చెందిన రూపా అనే మహిళ సమీపంలో ఉండే యువతిని హైదరాబాద్ నగరం నివాసం, జీవనోపాధికి బాగుంటుందని నమ్మించి ఆరు నెలల క్రితం అక్రమంగా పశి్చమ బెంగాల్ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.
ఇక్కడికి వచ్చాక మెహదీపట్నం మురాద్‌నగర్‌కు చెందిన షహనాజ్ ఫాతీమా(32) ఇంట్లో ఉంచింది. అనంతరం హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ సమీర్(23) బాధితురాలిని బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన హజేరా బేగం (41) ఇంటికి తీసుకొచ్చి నిర్బంధించారు. ‘నీవు వ్యభిచారం చేయాలని, లేకుంటే భారత్‌కు అక్రమంగా వచ్చావంటూ ఫిర్యాదు చేస్తే జైలుకు వెళుతావంటూ’ తీవ్రంగా బెదిరించడంతో బాధితురాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించింది.
ఇలా ఆరు నెలల నుంచి నగరంలోని పలు హోటళ్లకు బాధితురాలిని పంపించి వ్యభిచారం చేయించారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకొని శుక్రవారం బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రూపా, వీరికి సహకరించిన సర్వర్ అనే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో డీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.