కిక్కులేకుంటే రోడ్డెక్కలేరా.. గాడితప్పుతున్న జీవితాలు

Hyderabad: Police Advice Dont Drink And Drive Leads To End Life - Sakshi

ఐటీ కారిడార్‌లో వరుస ఘోర ప్రమాదాలు 

ఎక్కువశాతం ప్రమాదాలకు మద్యం..  

మితి మీరిన వేగమే కారణం

సాక్షి,హైదరాబాద్‌: మద్యం మత్తు... అతి వేగం విలువైన జీవితాలను చిత్తు చేస్తోంది. మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడుపుతూ తమతో పాటు పక్క వారిని కూడా బలి తీసుకుంటున్నారు. అర్ధ రాత్రి చేస్తున్న జాయ్‌ రైడ్‌లు బాధితుల కుటుంబాలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి. ఐటీ కారిడార్‌ పరిధిలో వీకెండ్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  మృతుల్లో ఎక్కువగా యువతే  ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నా ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.   

విషాదం మిగిల్చిన ఘటనలివే..  
► మధురానగర్‌కు చెందిన పి.ప్రియాంక (20) జార్జియాలో మెడిసన్‌ మూడవ సంవత్సరం చదువుతోంది. సెలవుల్లో నగరానికి వచ్చిన ఆమె 2020 నవంబర్‌ 9న స్నేహితులతో కలిసి జూబ్లిహిల్స్‌లోని ఎయిర్‌ లైఫ్‌ పబ్‌కు వెళ్లింది.  మద్యం సేవించిన స్నేహితుడు మిత్తి మోడీతో కలిసి కారులో జాయ్‌ రైడ్‌కు వెళ్లింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సమీపంలో వోల్వో కారును అతి వేగంగా నడుపుతూ చెట్టును ఢీ కొట్టాడు. దీంతో సీటు బెల్డ్‌ పెట్టుకోని ప్రియాంక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మిత్తి మోడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

►  కాంట్రగడ్డ సంతోష్‌ (24), స్నేహితులైన రోషన్‌ (23) చింతా మనోహర్‌ (23). పప్పు భరద్వాజ్‌ (20), పవన్‌ కుమార్‌ (24)లు కలిసి వీకెండ్‌ కావడంతో అంతా కలిసి మద్యం సేవించారు. గత డిసెంబర్‌ 12న తెల్లవారు జామున 2.48 గంటల సమయంలో డీఎల్‌ఎఫ్‌ నుంచి స్వీఫ్ట్‌ కారులో బయలు దేరారు. విప్రో జంక్షన్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడ్డా లెక్క చేయకుండా ముందుకు వెళ్లడంతో టిప్పర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు కావడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  

►  గోవాలో ఎంఎస్‌ చదువుతున్న వాకిటి సుజీత్‌ రెడ్డి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌లోని స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. గత జూన్‌ 27న ఉదయం 5.30 గంటలకు ఆడి కారులో వెళుతూ ఆటోను ఢీ కొట్టారు. ఆటో వెనక సీట్లో కూర్చున్న పబ్‌లో పని చేసే వై.ఉమేష్‌ కుమార్‌(37) ఫుట్‌పాత్‌పై ఎగిరి పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు సుజీత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  
►  తెల్లాపూర్‌ బోన్సాయ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే డి.అశ్రిత (23) కెనడాలో ఎంటెక్‌ పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరేందుకు సమయం ఉండడంతో నగరానికి వచ్చింది. స్నేహితులు తరుణి, సాయి ప్రకాష్, అభిషేక్‌లతో కలిసి మాదాపూర్‌లోని స్నార్ట్‌ పబ్‌కు వెళ్లింది. గత ఆగస్టు ఒకటిన రాత్రి 11.30 గంటల సమయంలో మద్యం సేవించిన అభిషేక్‌తో స్కోడా కారులో వెళ్లింది. 
► అతి వేగంగా కారు నడుపుతూ కొండాపూర్‌ మై హోం మంగళ వద్ద కారు అదుపుతప్పి నాలుగు ఫల్టీలు కొట్టడంతో అశ్రిత అక్కడికక్కడే మృతి చెందింది. అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 మద్యం తాగి డ్రైవింగ్‌ చేయవద్దు 
మద్యం సేవించి వాహనాలను నడపడం చట్ట రీత్యా నేరం. వీకెండ్‌ పార్టీలలో ఎంజాయ్‌ చేస్తున్న యువత మద్యం సేవించిన మైకంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యం సేవించిన వ్యక్తిని డ్రైవింగ్‌ చేయకుండా అడ్డు కోవాల్సిన బాధ్యత బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌ల నిర్వాహకులపై ఉంది. మద్యం తాగిన వారికి వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై యువతలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. మద్యం తాగి వాహనం నడిపివే వారు తమపై ఆధారపడిన కుటుంబం ఉందనే మిషయాన్ని మరువరాదు.  
– ఎన్‌.వెంకటేశ్వర్లు, డీసీపీ, మాదాపూర్‌ 

చదవండి: Hyderabad: సెక్స్‌వర్కర్లతో ఒప్పందం.. సోదరుడి ఇంట్లోనే..

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top