అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన హైదరాబాద్‌ మెట్రో

Hyderabad Metro Moved The Heart With Green Channel Route - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్‌&టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో  ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్‌&టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌  ఎస్‌ఓఎస్‌కు కాల్‌ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్‌ వచ్చింది. 

ఇందులో భాగంగానే హైదరాబాద్‌ మెట్రో.. సెప్టెంబర్‌ 26న తెల్లవారుజూమున గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటుచేయడంతో నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్‌ మెట్రోస్టేషన్‌ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్‌ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్‌ ఆపరేషన్‌ కోసం లైన్‌-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు.

ఈ సందర్భంగా ఎల్‌&టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటుచేయడంతో పాటుగా  వీలైనంత త్వరగా  గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్‌ఎంఆర్‌ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు.

కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్‌ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్‌ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top