రోజూ పైసల పండగే! | Huge corruption in sub-registrar offices in Telangana | Sakshi
Sakshi News home page

రోజూ పైసల పండగే!

Apr 22 2026 1:53 AM | Updated on Apr 22 2026 1:53 AM

Huge corruption in sub-registrar offices in Telangana

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతి 

స్లాట్‌ బుకింగ్‌ మొదలు ప్రతి లావాదేవీకి అదనంగా ముట్టజెప్పాల్సిందే..

కీలక సెంటర్లలో రోజుకు రూ.లక్ష లేనిదే ఇంటికి వెళ్లేదేలే..! 

రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో పోస్టింగులకు యమ డిమాండ్‌ 

డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అక్రమార్జన 

ప్రతి లావాదేవీకి కనీసం రూ.500–2,000 వరకు అదనంగా వసూలు 

డాక్యుమెంట్‌ను బట్టి రూ.10 వేల వరకు రేటు.. పై స్థాయిలోనూ ముడుపులు 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రోజుకు కోటి రూపాయలకు పైగా అవినీతి చోటుచేసుకుంటోందనే అంచనా 

చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు

సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్ల వరకు జరుగుతుండగా, పాత డాక్యుమెంట్లకు రూ.1,000, కొత్త డాక్యుమెంట్లు అయితే గజానికి ఇంత చొప్పున వసూలు చేస్తున్నారు. మార్టిగేజ్‌ డాక్యుమెంట్లకు రూ.3–10వేల వరకు తీసుకుంటున్నారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను వసూళ్లకు నియమించుకున్నారు. ఇక్కడ స్లాట్‌ బుకింగ్‌ కోసం రూ.2 వేలు డాక్యుమెంట్‌ రైటర్‌కు ఇవ్వాల్సిందే. ఇక్కడ మరింత విస్తుపోయే విషయమేమిటంటే.. గతంలో జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్‌ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తే ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తుండగా, ఈ కార్యాలయ భవనం అద్దెను డాక్యుమెంట్‌ రైటర్లే చెల్లిస్తున్నట్టు సమాచారం.  

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మూడు దస్తావేజులు, ఆరు పచ్చ నోట్లు అనే తరహాలో ప్రతిరోజూ అవినీతిలో మునిగి తేలుతున్నాయనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అనధికారికంగా డాక్యుమెంట్‌ రైటర్లే అద్దె చెల్లిస్తున్నారనేది సమాచారం కాగా.. ప్రభుత్వంతో సంబంధం లేని ఓ అనధికార వ్యవస్థకు చెందిన వ్యక్తులు ఈ విధంగా కార్యాలయం అద్దెను చెల్లిస్తున్నారంటే..స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఎంత విచ్చలవిడిగా ఉందో.. ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్ల ఆసరాతో సబ్‌ రిజిస్ట్రార్లు ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, వీటిల్లో 100కు పైగా మంచి రాబడి ఉన్నవని ఆ శాఖ అధికారులే గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 2,500 వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. రంగారెడ్డి లాంటి కీలకమైన సెంటర్లు, వైరా లాంటి చిన్న సెంటర్లు కలిపి సగటున ప్రతి లావాదేవీకి రూ.4 వేలు అదనంగా వసూలు చేస్తున్నారనేది ఓ అంచనా. ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగే అవినీతి రోజుకు రూ.కోటిపైనే. అంటే నెలకు ఓ రూ.25 కోట్లు..ఏడాదికి రూ.300 కోట్ల అవినీతి జరుగుతోందని స్పష్టమవుతుంది. ఇది కేవలం సక్రమంగా ఉండే లావాదేవీలకు అదనంగా తీసుకునేది మాత్రమే. ఆపై ఎంత జరుగుతుందో ఊహించుకోవచ్చు. కాగా ఈ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  

లావాదేవీల్లో అవినీతి లీలలు 
రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు 16 జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌  ప్రకారం ఈ నెలలోని 20 రోజుల్లో 65 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే రోజుకు కనీసం 3 వేల లావాదేవీలు జరిగాయన్నమాట. ఈ లావాదేవీలన్నిట్లో అనధికారికంగా డాక్యుమెంట్‌ రైటర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆవరణలోనే దుకాణాలు నడుపుతున్నారు. పై అధికారులు ఎవరైనా తనిఖీలకు వెళితే ఆ కాసేపూ షట్టర్లు దించేసి వెళ్లిపోతారు. ఇక అవినీతి దందా కొనసాగిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లు డిజిటల్‌ పేమెంట్లు కూడా స్వీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ.42 లక్షలు డిజిటల్‌ పేమెంట్ల రూపంలో సబ్‌ రిజిస్ట్రార్లు తీసుకున్నట్టు తేలింది. అవినీతి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తెచ్చిన స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థ ఈ అవినీతికి మరింత ఊతమిస్తోంది. కేవలం స్లాట్‌ బుకింగ్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌ రిజిస్ట్రార్లు ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తులు వందలు, వేలు వసూలు చేస్తుండటం గమనార్హం.  

కింది నుంచి పై వరకు వాటాలు! 
సబ్‌ రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీలకు, డీఐజీలు ఆపై అధికారులకు ప్రతి నెలా ఠంచనుగా వసూలు చేసిన ఆమ్యామ్యాల్లో స్థాయిని బట్టి వాటా ముట్టజెప్తారనేది బహిరంగ రహస్యం. అందుకే సబ్‌ రిజిస్ట్రార్లపై ఎంతటి అభియోగాలు వచ్చినా (ఏసీబీ, విజిలెన్స్‌ తనిఖీల్లో పట్టుబడితే తప్ప) ఎలాంటి చర్యలూ ఉండవు. మహా అంటే ఒక మెమో జారీ చేస్తారు. నాలుగు రోజుల తర్వాత అందరూ దాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత మళ్లీ యథాతథం. డబ్బులు ఇవ్వాల్సిందే.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. లేదంటే ఆ రోజు రిజిస్ట్రేషన్‌ పూర్తి కాదు.. సర్వర్లు పనిచేయవు.. సబ్‌ రిజిస్ట్రార్‌ తొందరగా వెళ్లిపోతారు. లేదంటే ఆ డాక్యుమెంట్‌ చేయడానికి నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఇలాంటివన్నీ తెరపైకి వస్తాయి. అదే డబ్బులు ముడితే మాత్రం.. వెంటనే పని అయిపోతుంది.   

ఇక్కడ పోస్టింగ్‌ వస్తే..కోట్లే! 
రాష్ట్రంలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు అక్కడక్కడా ఓ 11 కలిపితే మొత్తం 50 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఫోకల్‌ పాయింట్లుగా పేర్కొంటారు. ఇక్కడ పోస్టింగులు కావాలంటే ఉన్నతాధికారులకు లక్షల్లో ముట్టజెప్పాలనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే లక్షల్లో ఇచ్చి కోట్లలో సంపాదించుకునే అవకాశం ఉండటమే కారణం. సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రతి రోజూ పైసల పండుగేననేది బహిరంగ రహస్యం కాగా..హైదరాబాద్‌ శివార్లలో పోస్టింగ్‌ వస్తే ఏ స్థాయిలో ఆస్తులు కూడబెడతారో రాష్ట్రంలోని ఏ ఇతర సబ్‌ రిజిస్ట్రార్‌ను అడిగినా చెప్తారంటే అతిశయోక్తి కాదు. 

రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి తంతుకు సంబంధించి ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన విషయాలు మచ్చుకు కొన్ని.. 
ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలో రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి రోజూ 40 నుండి 50 వరకు దస్తావేజులు రిజిస్టర్‌ అవుతాయి. ప్రతి దస్తావేజుకు అనధికారికంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరు నమ్మకస్తులైన డాక్యుమెంట్‌ రైటర్లతో ఈ వసూళ్ల తంతు జరుగుతోంది. రోజుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూళ్లు జరుగుతాయని ఓ అంచనా.  
⇒ గజ్వేల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 30–40 నుంచి డాక్యుమెంట్లు అవుతాయి. ఇక్కడ 25 మంది డాక్యుమెంట్‌ రైటర్లు, 40 మంది ఏజెంట్లు ఉన్నారు. నాలా, జీపీఏలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు..ఇలా కేటగిరీల వారీగా రూ.2000 నుంచి 5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.  
⇒ కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు సెలవులో ఉంటే ఇన్‌చార్జిలు నడిపిస్తున్నారు. ఇక్కడ రోజుకు 50–60 వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కార్యాలయంలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.   

⇒ నిజామాబాద్‌ జిల్లా కేంద్ర కార్యాలయంలో నిత్యం 50 నుంచి 60 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేష¯న్‌ అవుతున్నాయి. ప్రతి దస్తావేజుకు రూ.500 నుంచి రూ.600 వరకు ఖర్చుల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. నాలా, ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు రూ.2 వేలకు పైన రూ.10వేల వరకు (డాక్యుమెంట్‌ను బట్టి) వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ఉండాలి. కానీ ఏడాదిన్నర క్రితం ఒకరు ఏసీబీకి దొరకగా, మరొకరు దీర్ఘకాలికంగా సెలవులోనే ఉంటున్నారు. డీఐజీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన చెప్పిన రేటు ఇస్తేనే లావాదేవీ పూర్తవుతుందనే ఆరోపణలున్నాయి.  
⇒ మహబూబ్‌నగర్‌లో డబ్బుల వసూలు బాధ్యతలు వారానికి ఒకరిని మారుస్తుటారు. ప్రతి దస్తావేజుకు ఆఫీసు ఖర్చుల కోసం రూ.700 అదనంగా వసూలు చేస్తుండగా, డాక్యుమెంట్‌ను బట్టి రూ.2–5వేల వరకు తీసుకుంటారు.  

ఏసీబీకి దొరికిన అవినీతి ఉదంతాల్లో కొన్ని.. 
⇒ వరంగల్‌లో ఈనెల 2,3 తేదిల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ప్రైవేట్‌ వ్యక్తి, డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా రూ.42 లక్షలు వసూలు చేసినట్టు తేలింది. 20 మంది డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి డిజిటల్‌ పేమెంట్‌ల రూపంలో ఈ మొత్తం తీసుకున్నట్టు ఏసీబీ నిర్ధారించింది.  
⇒ మూడు నెలల క్రితం మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ కార్యాలయం ఆవరణలోనే డాక్యుమెంట్‌ రైటర్లు షాపులను ఏర్పాటు చేసుకున్నారు. 
⇒ గత మూడేళ్లలో యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీకి దొరకగా, మరొక సబ్‌ రిజిస్టార్‌ ఒకేరోజు 150 డాక్యుమెంట్లు చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు.  
⇒ ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గతేడాదిలో ప్లాట్‌ గిప్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీకి చిక్కి సస్పెన్షన్‌కు గురయ్యారు.   
⇒ 2024 జూన్‌లో ఓ వ్యక్తి ప్లాటుకు అన్ని అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేసి రూ.99,200 లంచంగా తీసుకుంటుండగా.. అప్పటి సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ పట్టుకుంది.   

Advertisement
 
Advertisement
Advertisement