భరణం ఇస్తారా...ఆస్తులు వేలం వేయాలా?

High Court Warns Man Who Did Not Ready To Pay Alimony To His Wife - Sakshi

కుటుంబ వివాదంలో భర్తకు హైకోర్టు హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: విడాకులు తీసుకునే సమయంలో భార్యకు భరణంగా ఇస్తానన్న డబ్బు ఇవ్వని భర్తపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 5లోగా భరణంలో కొంత భాగం రూ.5 లక్షలు చెల్లించాలని లేకపోతే భర్తకు చెందిన ఆస్తులను వేలం వేయిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సూర్యాపేటకు చెందిన ఎ.లక్ష్మీతులసి, మహబూబ్‌నగర్‌ పట్టణంలోని షాషాబ్‌గుట్ట ప్రాంతానికి చెందిన ఎ.సురేందర్‌ భార్యాభర్తలు.

వీరి మధ్య విభేదాలు రావడంతో 2006లో ఫ్యామిలీ కోర్టు వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ లక్ష్మీతులసి హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ సమయంలో భార్యకు భరణంగా రూ.10 లక్షలు ఇస్తానని సురేందర్‌ పేర్కొన్నారు. 2006లో విడాకులు మంజూరైన సమయంలో తమకు ఏడాది, మూడేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారు పెద్దవాళ్లు అయ్యారని, ఈ నేపథ్యంలో భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ లక్ష్మీతులసి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

రూ.40 లక్షలు, తనకున్న భూమిలో కొంత భాగాన్ని పిల్లల పేరుతో రిజి స్ట్రేషన్‌ చేస్తానని గత విచారణ సమయంలో చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని లక్ష్మీతులసి ధర్మాసనానికి నివేదించారు. మహబూబ్‌నగర్‌ శివార్లలోని పాలకొండలో సురేందర్‌కు దాదాపు 7 ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం ఎకరా కోటి రూపాయల వరకు ధర పలుకుతోందని తెలిపారు. అలాగే వారసత్వంగా ఒక ఇంటిలో కొంత భాగం కూడా సురేందర్‌కు వచ్చిందని, ఇంత ఆస్తి ఉన్నా తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ భూముల విలువతోపాటు సురేందర్‌కు వచ్చే ఇంటి భాగం విలువ ఎంతుందో తెలుసుకొని తమకు నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ను గత ఏడాది డిసెంబర్‌లో ఆదేశించింది. ఇటీవల ఈ పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చింది. అయితే ఇప్పటికీ సురేందర్‌ డబ్బు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, మార్చి 5లోగా డబ్బు జమ చేయకపోతే ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరిస్తూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.   

చదవండి:
22 నుంచి హైకోర్టులో భౌతిక విచారణ
నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top