
గురువారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో జలమయమైన రహదారి
హైదరాబాద్‌లో కుండపోత వర్షంతో చెరువులుగా మారిన రోడ్లు
గంటన్నర వ్యవధిలో బీభత్సం సృష్టించిన వాన
లోతట్టు ప్రాంతాలు, కాలనీలన్నీ జలమయం.. నగరం మొత్తం ట్రాఫిక్ పద్మవ్యూహంలో..
కిలో మీటర్ల దూరం నిలిచిన వాహనాలు
గచ్చిబౌలిలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.
సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్‌మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.
నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..
రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్‌బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, బషీర్‌బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్‌పేట వరకు, ట్యాంక్‌బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కూ కట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్‌బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్‌భవన్ రహదారి నీట మునిగింది.
పలు జిల్లాల్లోనూ..
పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు.