అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్‌ స్పష్టీకరణ 

HCA Not At Fault In Stampede Like Situation During Ticket Sale Says Mohammed Azharuddin - Sakshi

మ్యాచ్‌ నిర్వహణపై సుప్రీం కమిటీ సమీక్ష 

ఉప్పల్‌/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్‌ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు.

జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్‌ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్‌సీఏ ప్రమేయం లేదు. ఆన్‌లైన్‌ టికెట్లను బ్లాక్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు.

ఆన్‌లైన్‌లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్‌లైన్‌లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్‌ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్‌ పేర్కొన్నారు. 

సజావుగా నిర్వహించేందుకు... 
హెచ్‌సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, ఏసీబీ డైరెక్టర్‌ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్‌ పాల్గొన్నారు. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్‌ కక్రూ తెలిపారు. మ్యాచ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు.   

టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 
హఫీజ్‌పేట్‌: హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రంగంలోకి దిగి, హెచ్‌సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు.

మియాపూర్‌ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్‌ హోటల్‌లో శుక్రవారం జరిగిన ప్రవాస్‌ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్‌లైన్‌ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్‌ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్‌ను బ్లాక్‌లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top