జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే..

Hawala Money 90 lakhs Seized by Jubilee hills police Hyderabad - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి చేరవేసేందుకే డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట్‌ సమీపంలోని పూడూరుకు చెందిన కడారి శ్రీనివాస్, జూబ్లీహిల్స్‌రోడ్‌నం.82లోని త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాల యం నుంచి రూ.89.92 లక్షలు తీసుకొని టీఎస్‌ 27డి7777 థార్‌ కారులో వెళ్తున్నాడు. భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బ్యాగుల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించడంతో విచారించగా శ్రీనివాస్‌ నుంచి సరైన సమాధానం రాలేదు. డబ్బుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

పోలీసులు విచారించగా తాను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పీఏ జనార్ధన్‌ డ్రైవర్‌నని, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ నుంచి డబ్బు తీసుకొని రావాల్సిందిగా జనార్ధన్‌ చెప్పగా వచ్చానని, ఆ మేరకు నగదు తీసుకుని వస్తున్నానని శ్రీనివాస్‌ చెప్పారు. డబ్బు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి చేర్చడానికి వెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తి అంగీకరించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆ మేరకు నేరాంగీకార వాంగ్మూలం నమోదుచేశారు. శ్రీనివాస్‌కు సెక్షన్‌ 41(ఏ) నోటీసు అందజేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top