జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందే 

Harish Rao Fires On Central Government Over GST - Sakshi

కేంద్రానికి ఇంకోమార్గం లేదు 

మిగిలితే కేంద్రం తీసుకుంటుంది.. తగిలితే రాష్ట్రాలు అప్పుతెచ్చుకోవాలా?  

ఇదెక్కడి నీతి.. తెలంగాణ అంగీకరించదు 

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోంది

కేంద్రం వైఖరి మారకపోతే పార్లమెంటులో నిలదీస్తాం 

అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం  

బీజేపీయేతర రాష్ట్రాల మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆర్థికమంత్రి హరీశ్‌ వ్యాఖ్యలు.. సమావేశానికి హాజరైన బెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ పరిహారం నిధులను పూర్తిగా చెల్లించడం మినహా కేంద్రానికి మరోమార్గం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్రం చేతులెత్తేయడం సరికాదని అన్నారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే పార్లమెంటులో నిలదీస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. సోమవారం జరిగిన బీజేపీయేతర రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి బెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... 

నైతికంగా పరిహారం చెల్లించాల్సిందే... 
‘జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఏజీఐ)ను కూడా సంప్రదించింది. పరిహారం రాష్ట్రాలకివ్వాల్సి ఉంటుందని ఏజీ చెప్పారు. చెల్లింపు ఎలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలుండొచ్చు కానీ, ఇవ్వాల్సిందే. పరిహారాన్ని కోవిడ్, జీఎస్టీ నష్టంగా విడగొట్టాలని ఏజీ చెప్పలేదు. న్యాయపరంగా, నైతికంగా.. ఎలా చూసినా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిందే. కేంద్రానికి ఇంకో అవకాశం లేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడేళ్లలో సెస్‌ డబ్బులు మిగిలినప్పుడు తీసుకున్నారు. ఐజీఎస్టీని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేసుకున్నారు. అంటే.. మిగిలినప్పుడు కేంద్రం తీసుకుంటుంది, తగిలితే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవాలా? ఇదెక్కడి నీతి? పరిహారం కింద రూ.3 లక్షల కోట్లు ఇవ్వబోమని, రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే ఇస్తామంటూ కేంద్రం రూ.1.35 లక్షల కోట్ల పరిహారం తగ్గించే ఆలోచన చేస్తోంది. దీన్ని తెలంగాణ అంగీకరించదు’ 

జీఎస్టీలో చేరకుంటే 25 వేల కోట్లు వచ్చేవి
‘కోవిడ్‌ వల్ల కేంద్రమే కాదు, రాష్ట్రాలూ నష్టపోయాయి. గత 4 నెలల్లో తెలంగాణ 34% ఆదాయం కోల్పోయింది. రూ.8 వేల కోట్లు తగ్గాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాలకు నిధులిచ్చి ఆదుకోవాలి. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టాలని చూస్తోంది. జీఎస్టీలో చేరేటప్పుడే తెలంగాణ వెనకా ముందూ ఆలోచించింది. మనం జీఎస్టీలో చేరకుండా ఉంటే అదనంగా రూ.25 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. కానీ, దేశ విస్తృత ప్రయోజనాలు, పన్నుల సరళీకరణ, పెట్టుబడుల ఆకర్షణ లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని చేరాం. గత మూడేళ్లలో జీఎస్టీ సెస్‌ కింద రూ.18,032 కోట్లు కేంద్రానికి చెల్లించాం. కానీ, రాష్ట్రం తిరిగి పొందింది రూ.3,200 కోట్లే.

యూపీఏ ప్రభుత్వం చేసిన విధంగానే నష్టం చేయొద్దని జీఎస్టీ ప్రాథమిక చర్చల్లోనే కేంద్రానికి చెప్పాం. పార్లమెంటులో చట్టం చేస్తున్నందున నమ్మాలని కేంద్రం చెప్పింది. కానీ, అదే చట్టాన్ని కేంద్రం ఇప్పుడు ఉల్లంఘిస్తోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి వాటి ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్ర పాలకులు అధికారాలను తీసేసుకుంటున్నారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకుంటే ఇచ్చిన మాట అమలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తోంది. వనరుల సమీకరణకు రాష్ట్రాల కన్నా కేంద్రానికి అవకాశాలు ఎక్కువ. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులూ కేంద్రానికి ఎక్కువే. ఎప్పుడంటే అప్పుడు ఆ పరిమితిని పెంచుకునే అవకాశముంది’అని హరీశ్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top