తిరుమల కొండలకు జీఎస్‌ఐ రక్షణ

GSI: Geological Survey Of India Protection Of Tirumala Hills - Sakshi

కొండచరియలు విరిగిపడకుండా చర్యలు

వాననీటి ప్రవాహాల మళ్లింపునకు సూచనలు

విస్తృత సర్వే నిర్వహణకు నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కొండచరియలు విరిగిపడే ఘటనలకు చెక్‌ పెట్టేందుకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) భారీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. కొండ ప్రాంతాలు సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.

స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బండ్లగూడలోని జీఎస్‌ఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ దక్షిణాది విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ జనార్దన్‌ ప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. దేశంలో 7–8 ఏళ్లుగా పర్వత సానువుల సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది తిరుమల కొండలనూ సర్వే చేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా తిరుమల కొండలపై వాననీటి ప్రవాహాలను గుర్తించి వాటి ద్వారా కొండలు బలహీన పడకుండా ఉండేలా తగిన పరిష్కార మార్గాలనూ సూచిస్తామని వివరించారు.

వనరుల మ్యాప్‌లు విడుదల....
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో ఉండే ఖనిజాలు, భూగర్భ జలాలు, భూ వినియోగం తీరుతెన్నులతోపాటు ఇతర భౌగోళిక అంశాలను సూచించే డిస్ట్రిక్ట్‌ రిసోర్స్‌ మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నామని సంస్థ తెలంగాణ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.చక్రవర్తి తెలి­పారు. ఇప్పటికే 22 జిల్లాల మ్యాప్‌లు సిద్ధమ­వగా మిగిలినవి మరో నెల రోజుల్లో పూర్తవు­తాయని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల, పోలవరం, కొలిమలై వంటి ప్రాజెక్టుల పూర్తిస్థాయి సర్వేలను కూడా ఈ ఏడాది చేపట్టినట్లు ఆయన వివరించారు.

ఫ్లోరైడ్‌ కాలుష్యంపై అధ్యయనం..
నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ కా­లుష్యం, మూత్రపిండాల సమస్యలకు కారణా లను అన్వేషించే పనులను పబ్లిక్‌ గుడ్‌ జియో సైన్స్‌లో భాగంగా చేపట్టామన్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా, కర్ణాటకలోని రాయచూరులో ఆర్సెనిక్, ఫ్లోరైడ్‌ కాలుష్యాలకు కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top